క్రూడ్‌కు కోవిడ్‌ దెబ్బ!

28 Feb, 2020 05:20 IST|Sakshi

న్యూయార్క్‌: కోవిడ్‌–19 ప్రపంచ ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్న భయాందోళనలు క్రూడ్‌ ధరలపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో గురువారం ఒక దశలో క్రూడ్‌ ధర 5 శాతానికి పైగా పడిపోయింది. ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి నైమెక్స్‌ లైట్‌ స్వీట్‌ ధర బ్యారెల్‌కు 47.10 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్‌ 54.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ ధరలు వరుసగా  45.88 డాలర్లు, 50.39 డాలర్లనూ తాకడం గమనార్హం. నైమెక్స్‌ క్రూడ్‌కు కీలక మద్దతు 42 డాలర్లు కాగా, ఇదీ కోల్పోతే 26 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఇదే జరిగితే క్రూడ్‌కు ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది.   

250 బిలియన్‌ డాలర్ల నష్టం:  పీహెచ్‌డీసీసీఐ  
ఇదిలావుండగా, పారిశ్రామిక చాంబర్‌ పీహెచ్‌డీసీసీఐ గురువారం కరోనా వైరెస్‌ వ్యాధిపై తమ అంచనాలను విడుదల చేస్తూ, దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటుపై 30 బేసిస్‌ పాయింట్ల ప్రతికూల ప్రభావం లేదా 250 బిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతుందని అంచనా వేసింది. సరఫరాపరమైన సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతుందని వివరించింది.

మరిన్ని వార్తలు