7వారాల గరిష్టానికి చమురు ధర

22 Mar, 2018 10:47 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అనూహ్యంగా చమురు  మరోసారిపైకి ఎగబాకాయి. ముఖ్యంగా అంచనాలకు విరుద్ధంగా అమెరికా ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు బుధవారం మరోసారి వేడెక్కాయి.  మంగళవారం పుంజుకున్న​ చమురు ధరలు మరింత ఎగిసి ఏడువారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. వాషింగ్టన్  ఇరాన్‌కు  వ్యతిరేకంగా ఆంక్షలు తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కనిపిస్తోందనీ,  ఇది ముడి చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీయనుందని డెన్మార్క్  సాక్సో బ్యాంక్‌ కమొడిటీ స్ట్రాటజిస్ట్‌  హెడ్‌ ఓలే హాన్సెన్  పేర్కొన్నారు.  మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కూడా చమురు ధరలకు తోడ్పడుతున్నాయని విశ్లేషకుల అంచనా.

యూఎస్‌ మార్కెట్‌ నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 0.3 శాతం బలపడి 65.39 డాలర్లను తాకగా..  లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు సైతం బ్యారల్‌ 0.3 శాతం ఎగసి దాదాపు 70  డాలర్లకు చేరింది.  వెరసి ఏడు వారాల గరిష్టానికి చమురు ధరలు చేరాయి. కాగా.. ప్రస్తుతం నైమెక్స్‌ 65.22 డాలర్ల వద్ద  కొనసాగుతుండగా.. బ్రెంట్‌ బ్యారల్‌ 69.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  మార్చి 16తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 2.74 మిలి యన్‌ బ్యారళ్లమేర తగ్గినట్లు మంగళవారం అమెరికా ఇంధన శాఖ వెల్లడించింది.

వాస్తవానికి 2.55 మిలియన్‌ బ్యారళ్లమేర నిల్వలు పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో 5మిలియన్‌ బ్యారళ్లమేర అంచనాలు తారుమారు కావడంతో చమురు ధరలు భారీగా పెరిగాయని నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామంటూ సౌదీ అరేబియా ప్రకటించడం, వెనిజులాలో చమురు ఉత్పత్తి గత  నెలలో 1.54 మిలియన్‌ బ్యారళ్లమేర తగ్గడం వంటి అంశాలు సైతం ధరల మంట పుట్టించినట్లు నిపుణులు తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు