భారత ఆర్థిక వ్యవస్థకు చమురు సెగ!

20 Apr, 2018 00:24 IST|Sakshi

77.75 డాలర్లకు చేరిన బ్రెంట్‌ క్రూడ్‌

ఇది మూడేళ్ల గరిష్ట స్థాయి  

లండన్‌: అంతర్జాతీయ మార్కెట్‌ బ్రెంట్‌ ధర బేరల్‌కు గురువారం మూడేళ్ల గరిష్టస్థాయి 77.75 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9.30 గంటల సమయంలో ఇదే రేటు వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్‌ క్రూడ్‌ కూడా 74.75 వద్ద గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది. మధ్య ప్రాశ్చ్య దేశాల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో పెరిగిన క్రూడ్‌ డిమాండ్, క్రూడ్‌ 100 డాలర్లకు చేరాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఈ కమోడిటీ పరుగుకు దారితీస్తున్నాయి. తన చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులపై ఆధారపడే భారత్‌ ఆర్థిక వ్యవస్థపై క్రూడ్‌ ధరల పెరుగుదల తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు, తద్వారా క్యాడ్‌ (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూలతలు, ఈ నేపథ్యంలో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనతలు, స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులు భారత్‌ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే కనబడుతున్న సంగతి తెలిసిందే.  

చతికిలపడిన చమురు షేర్లు... 
చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో  ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ 4–7 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎమ్‌ఆర్‌పీఎల్‌ షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.  

మరిన్ని వార్తలు