కరోనా కష్టాలు :  ఓలా ఏం చేసిందంటే...

28 Mar, 2020 14:21 IST|Sakshi
ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ (ఫైల్ ఫోటో)

సాక్షి, ముంబై : లాక్ డౌన్ కష్టాలనుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా నడుం బిగించింది. కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తి, లాక్  డౌన్ ఇబ్బందుల్లో పడిన  లక్షలమంది డ్రైవర్లను ఆదుకునేందుకు  ముందుకు వచ్చింది. నిరుద్యోగులుగా మిగిలిపోయిన డ్రైవర్లకు, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలకోసం  రూ. 20 కోట్లతో ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ప్రారంభిస్తున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. స్వయంగా తన వార్షిక జీతాన్ని ఈ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దాతలందించే  ప్రతీ చిన్న సహకారం మిలియన్ల కుటుంబాల శ్రేయస్సుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందనీ, ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ  క్రౌడ్ ఫండింగ్ ద్వారామొత్తం రూ .50 కోట్లు సేకరించాలని కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.  

సంక్షోభ సమయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అవసరమైన సామాగ్రి, ఉచిత వైద్య సేవలు లాంటి వాటిపై దృఫ్టి పెట్టినట్టు తెలిపారు. అలాగే వారి పిల్లల విద్యకు ఆర్థిక సహాయం లాంటి అంశాలపై కూడా చొరవ తీసుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వెన్నుముక లాంటి తమ డ్రైవర్లు ప్రస్తుత అసాధారణ సమయంలో ఆదాయంలేక ఇబ్బందుల్లో పడ్డారని, వారిని ఆదుకునే లక్ష్యంతోనే సంస్థ ఈ నిధిని ప్రారంభించిందని ఓలా కమ్యూనికేషన్స్ హెడ్ ఆనంద్ సుబ్రమణియన్ తెలిపారు. తక్షణ సహాయం అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. అయితే ఇప్పటికే తమ డ్రైవర్ల కోసం ప్రత్యేక కోవిడ్-19 బీమా కవరేజీని ప్రకటించింది. అలాగే ఓలా అనుబంధ సంస్థ  ఫ్లీట్ టెక్నాలజీస్ డ్రైవర్ల లీజ్ రెంట్లను, ఈఎంఐలను కూడా మాఫీ చేసింది. ఓలా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల క్యాబ్‌లను కలిగి వుంది.

మరిన్ని వార్తలు