హైదరాబాద్‌లో ఓలెక్ట్రా బస్‌ ప్లాంటు

6 Mar, 2019 05:22 IST|Sakshi
ఈ–బస్‌ల ప్రారంభోత్సవంలో ఆర్‌టీసీ, ఓలెక్ట్రా ప్రతినిధులు

300 ఎకరాలు, రూ.300 కోట్ల పెట్టుబడి

ప్లాంటు ద్వారా 7,500 మందికి ఉపాధి

శంషాబాద్‌కు ప్రారంభమైన ఈ–బస్‌లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీలో ఉన్న ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ వద్ద అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సంస్థకు జడ్చర్ల వద్ద తయారీ కేంద్రం ఉంది. ప్రతిపాదిత నూతన ప్లాంటు కోసం తెలంగాణ ప్రభుత్వం 300 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఏడాదిన్నరలో తొలి దశ పూర్తి అవుతుంది. ఆ తర్వాత రెండేళ్లకు రెండు, మూడవ దశ పూర్తి చేస్తామని ఓలెక్ట్రాను ప్రమోట్‌ చేస్తున్న మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ కె.వి.ప్రదీప్‌ తెలిపారు. బీవైడీ–ఓలెక్ట్రా తయారీ 40 ఎలక్ట్రిక్‌ బస్‌లను టీఎస్‌ఆర్‌టీసీ మంగళవారమిక్కడ ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఫ్యాక్టరీకి రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. అన్ని దశలు పూర్తి అయితే ప్రత్యక్షంగా 3,500 మందికి, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.  

ఏటా 10 వేల యూనిట్ల విపణి..
ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దే శించిన ఫేమ్‌–2 పథకంతో ఈ రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని ఓలెక్ట్రా ఎండీ ఎన్‌.కె.రావల్‌ తెలిపారు. ‘మూడేళ్లలో ఫేమ్‌–2 కింద 7,000 బస్‌లకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ఏటా భారత్‌లో 10,000 ఎలక్ట్రిక్‌ బస్‌లు రోడ్డెక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ–బస్‌ల వినియోగాన్ని పెంచనున్నాయి. ప్రస్తుతం ఓలెక్ట్రా మూడు రకాల మోడళ్లలో బస్‌లను తయారు చేస్తోంది. మరిన్ని మోడళ్లను పరిచయం చేస్తాం. ప్రస్తుతం 120 బస్‌లకు ఆర్డర్‌ బుక్‌ ఉంది’ అని వివరించారు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్‌ బస్‌ల విభాగం కోసం మేఘా ఇంజనీరింగ్‌ రూ.800 కోట్లు ఖర్చు చేసింది.

పెట్టుబడులు కొనసాగిస్తాం..
భారత్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌ల రంగంలో రానున్న రోజుల్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఓలెక్ట్రా భాగస్వామి బీవైడీ ఇండియా ఎండీ లియో షోలియాంగ్‌ అన్నారు. దేశంలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఇక్కడ రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. ఇలా పెట్టుబడులకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే ఓలెక్ట్రా రూపొందించిన 68 బస్సులు హిమాచల్‌ ప్రదేశ్, పుణే, కేరళ, ముంబైతోపాటు శంషాబాద్‌ విమానాశ్రయంలో పరుగెడుతున్నాయని ఓలెక్ట్రా ఈడీ ఎన్‌.నాగ సత్యం తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన 40 బస్సులతో కలిపి వీటి సంఖ్య 108కి చేరుతుందని చెప్పారు. ఒక్కో బస్సు ఒకసారి చార్జింగ్‌తో 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ సీవోవో ఆనంద్‌ స్వరూప్‌ తెలిపారు. ఈ–బజ్‌ కే9 పేరుతో రూపొందిన ఈ మోడల్‌ ఏసీ బస్‌లు 12 మీటర్ల పొడవుంటాయి. డ్రైవరుతో కలిపి 40 మంది కూర్చోవచ్చు.  

ఇతర నగరాలకు ఈ–బస్‌లు..
మియాపూర్, జేబీఎస్‌ బస్టాండ్‌ నుంచి వివిధ మార్గాల ద్వారా శంషాబాద్‌కు ఈ 40 బస్‌లను నడుపుతారు. ఇన్ని ఎలక్ట్రిక్‌ బస్‌లు ఒకేసారి రోడ్డెక్కడం దేశంలో ఇదే ప్రథమమని రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సునీల్‌ శర్మ అన్నారు. ఈ–బస్‌ల విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాల్సిందేనని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ప్రధాన నగరాలకు ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రవేశపెడతామని వెల్లడించారు. పెరుగుతున్న కాలుష్యం, ఇంధన ధరల కట్టడికి ఈ–బస్‌లు పరిష్కారమని అభిప్రాయపడ్డారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా