ఈ రియల్టీ షేరు ఎందుకిలా పడుతోంది?

13 Jul, 2020 14:28 IST|Sakshi

ఒమాక్సీ లిమిటెడ్‌.. బేర్‌బేర్‌

12వ రోజూ డౌన్‌ సర్క్యూట్‌

జూన్‌ 26 నుంచి 66% మైనస్‌

11 ఏళ్ల కనిష్టానికి షేరు ధర

కొద్ది రోజులుగా భారీ అమ్మకాలను చవిచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఒమాక్సీ లిమిటెడ్‌ షేరు మరోసారి కుప్పకూలింది.కొనేవాళ్లు కరువుకాగా.. అమ్మకందారులు అధికంకావడంతో ఈ షేరు 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం రూ. 76 దిగువన ఫ్రీజయ్యింది. వెరసి వరుసగా 12వ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నేలచూపులకే పరిమితమై కదులుతోంది. జూన్‌ 26న నమోదైన రూ. 221 స్థాయి నుంచి నిరంతర పతనం కారణంగా ఈ షేరు 66 శాతం విలువను కోల్పోయింది. తద్వారా తాజాగా 11 ఏళ్ల కనిష్టానికి చేరింది. ఇంతక్రితం 2019 జులై 14న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది.

కంపెనీ వివరణ
కంపెనీ కౌంటర్‌లో నమోదవుతున్న యాక్టివిటీ పూర్తిగా మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా జరుగుతున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఒమాక్సీ ఈ నెల మొదట్లోనే తెలియజేసింది. కంపపెనీ ప్రాజెక్టులు యథాతథంగా కొనసాగుతన్నాయని, డిమాండ్‌, సరఫరా అంశాల ఆధారంగానే ట్రేడింగ్‌లో ఆటుపోట్లు నమోదవుతున్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను కోవిడ్‌-19 నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా మాత్రమే వాయిదా వేసినట్లు తెలియజేసింది.  

ఏం జరిగింది?
తనఖాలో ఉంచిన 1.6 లక్షల షేర్లను వారాంతాన(10న) రుణదాత సంస్థ వీనస్‌ ఇండియా అసెట్‌ ఫైనాన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకున్నట్లు ఒమాక్సీ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. కంపెనీలో మొత్తం 74.15 శాతం వాటాకు సమానమైన 135.63 మిలియన్‌ షేర్లను కలిగిన ప్రమోటర్లు మార్చికల్లా 52.32 శాతం వాటాకు సమానమైన 70.97 మిలియన్‌ ఈక్విటీ షేర్లను తనఖాలో ఉంచినట్లు డేటా వెల్లడించింది. రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ ఏప్రిల్‌ 3న ఒమాక్సీ దీర్ఘకాలిక బ్యాంకింగ్‌ సౌకర్యాలను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇందుకు భారీ రుణ భారంతోపాటు, కంపెనీ మాజీ ఎండీ సునీల్‌ గోయల్‌.. మరో డైరెక్టర్‌ రోహ్‌తాస్‌ గోయల్‌పై చేసిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్‌ పేర్కొంది. తదుపరి జూన్‌ 29న వెల్లడించవలసిన గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాల విడుదలను కంపెనీ జులై 29కు వాయిదా వేసింది. ఈ ప్రతికూలతల కారణంగా ఒమాక్సీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు