ఒమాక్సే పతనం- శిల్పా మెడి జూమ్‌

30 Jun, 2020 11:37 IST|Sakshi

క్యూ4 ఫలితాల వాయిదా

రెండో రోజూ కుప్పకూలిన ఒమాక్సే షేరు

కిడ్నీ క్యాన్సర్‌కు జనరిక్‌ ఔషధం 

5 శాతం జంప్‌చేసిన శిల్పా మెడికేర్‌

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాల విడుదలకు సోమవారం(29న) నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించడంతో రియల్టీ కంపెనీ ఒమాక్సే లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క కిడ్నీ క్యాన్సర్‌ చికిత్సకు జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేసినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ శిల్పా మెడికేర్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వెరసి ఒమాక్సే లిమిటెడ్‌ వరుసగా రెండో రోజు లోయర్‌ సర్క్యూట్‌ను తాకగా.. శిల్పా మెడికేర్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

ఒమాక్సే లిమిటెడ్‌
ఈ నెల 29న నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని నెల రోజులపాటు వాయిదా వేసినట్లు రియల్టీ కంపెనీ ఒమాక్సే లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బోర్డు సమావేశంలో భాగంగా కంపెనీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించవలసి ఉంది. జులై 29న బోర్డును తిరిగి సమావేశపరచనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 35 పతనమై రూ. 141 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. సోమవారం సైతం ఈ కౌంటర్‌ 20 శాతం కుప్పకూలడం గమనార్హం. కాగా.. గత రెండు నెలల్లో ఈ షేరు 44 శాతం ర్యాలీ చేసింది. ఏప్రిల్‌ 27న నమోదైన రూ. 153 నుంచి పెరుగుతూ వచ్చి రెండు రోజులుగా పతన బాట పట్టింది.

శిల్పా మెడికేర్‌
కిడ్నీ క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించగల జనరిక్‌ ఔషధం యాక్సిటినిబ్‌ను విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ శిల్పా మెడికేర్‌ తాజాగా పేర్కొంది. యాక్సిషిల్‌ బ్రాండుతో 1 ఎంజీ, 5 ఎంజీ డోసేజీలలో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఒక బాటిల్‌లో 14 ట్యాబ్లెట్లను అందించనున్నట్లు వివరించింది. అడ్వాన్స్‌డ్‌ రేనల్‌ సెల్‌ కార్సినోమా(ఆర్‌సీసీ)తో బాధపడే రోగుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిల్పా మెడి షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 496 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 498 వరకూ ఎగసింది.

మరిన్ని వార్తలు