10 సంవత్సరాల్లో 10 రెట్ల వృద్ధి

8 Dec, 2015 02:15 IST|Sakshi
10 సంవత్సరాల్లో 10 రెట్ల వృద్ధి

2022 నాటికి టర్నోవర్ 30 బిలియన్ డాలర్లకు..
 ప్రస్తుత విభాగాలను పటిష్టం చేస్తాం
 సాక్షితో గోద్రెజ్ అండ్ బాయ్స్
 ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నవ్రోజ్ గోద్రెజ్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
కన్జూమర్ ప్రొడక్ట్స్, రియల్ ఎస్టేట్, గృహోపకరణాల తయారీ వంటి పలు రంగాల్లో ఉన్న భారతీయ వ్యాపార దిగ్గజం గోద్రెజ్ గ్రూప్ భారీ లక్ష్యంతో అడుగులేస్తోంది. 15 రకాల వ్యాపారాలతో భారత్‌తోసహా అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఈ సంస్థ 10 సంవత్సరాల్లో టర్నోవర్‌లో 10 రెట్ల వృద్ధిని నమోదు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం గ్రూప్ టర్నోవర్ రూ.25,000 కోట్లుంది. ఏటా 20-25 శాతం వృద్ధి చెందుతున్నట్టు గోద్రెజ్ అండ్ బాయ్స్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్ ఈడీ నవ్‌రోజ్ గోద్రెజ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
 
  2022 నాటికి 30 బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.1.95 లక్షల కోట్లు) వ్యాపారం నమోదు చేయాలన్నది ప్రణాళిక అని వెల్లడించారు. ప్రస్తుతం గ్రూప్ నిర్వహిస్తున్న వ్యాపారాలను మరింత పటిష్టం చేస్తామన్నారు. ప్రతిరోజు 60 కోట్ల మంది భారతీయులు గోద్రెజ్ రూపొందించిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులను వాడుతున్నారని గోద్రెజ్  చెబుతోంది. భవిష్యత్తులో మరో 60 కోట్ల మందికి చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం.  
 
 పరిశీలనలో హైదరాబాద్..
 డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో దక్షిణాదిన ప్లాంటు పెట్టాలని సంస్థ భావిస్తోంది. మిస్సైల్ సిస్టమ్స్, లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్స్, క్రయోజనిక్ ఇంజన్స్, శాటిలైట్ బూస్టర్ సిస్టమ్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు బెంగళూరు, హైదరాబాద్‌లో ప్రముఖంగా కేంద్రీకృతమవడంతో కంపెనీ ఇప్పుడు దక్షిణాది వైపు చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నవ్‌రోజ్ స్పందిస్తూ ప్లాంటు ఏర్పాటు విషయంలో హైదరాబాద్‌ను తప్పక పరిశీలిస్తామని వెల్లడించారు. ఇక గోద్రెజ్ ప్రాపర్టీస్ భాగ్యనగరంలో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టనుందని పేర్కొన్నారు. టీసీఎస్, యాక్సెంచర్, క్యాప్‌జెమిని, రిలయన్స్ వంటి సంస్థలకు టర్న్‌కీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
 
 పూర్తి స్థాయిలోనే రంగంలోకి..
 గృహోపకరణాల రంగంలో కొత్త విభాగాల్లోకి అడుగు పెట్టనున్నట్టు ఈడీ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. మొబైల్ ఫోన్ల రంగంలోకి ఇప్పట్లో ప్రవేశించేది లేదన్నారు. సొంతంగా తయారు చేయనప్పటికీ కొన్ని కంపెనీలు బ్రాండ్ పేరు ముద్రించుకుని విక్రయిస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. బ్రాండ్ పేరు వేసుకుని అమ్మడం తమ అభిమతం కాదన్నారు. ఒక విభాగంలో ప్రవేశించడమంటే పూర్తి స్థాయిలో పరిశోధన, అభివృద్ధితోపాటు తుది ఉత్పాదన వరకు కంపెనీ నిమగ్నమవుతుందని స్పష్టం చేశారు. ఇన్నోవేషన్ కోసం ప్రత్యేకంగా గోద్రెజ్ అండ్ బాయ్స్‌లో 60 మంది నిపుణుల బృందం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడి కస్టమర్లకు కావాల్సిన ఉత్పత్తుల తయారీకై ఈ బృందం నిమగ్నమవుతుందని వివరించారు.
 
 రూ.700 కోట్లతో విస్తరణ..
 గోద్రెజ్ గ్రూప్ ప్రస్తుతం ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు, డిఫెన్స్, ఏరోస్పేస్ పరికరాలు, గృహోపకరణాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, భద్రతా ఉపకరణాల వంటి విభిన్న ఉత్పత్తుల తయారీలో ఉంది. సంస్థకు వివిధ ప్రాంతాల్లో 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి. కంపెనీ తాజాగా మహారాష్ట్రలోని కొపోలి వద్ద భారీ కాంప్లెక్సును నిర్మిస్తోంది. ఇక్కడ వివిధ ఉత్పత్తుల తయారీకై సుమారు 15 ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నారు. 2017 కల్లా దీని నిర్మాణం పూర్తి అవుతుంది. ఇది పూర్తి అయితే తయారీ రంగంలో గోద్రెజ్ కొత్త రికార్డులను నమోదు చేయనుంది. ఈ కాంప్లెక్సు కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు నవ్‌రోజ్ వెల్లడించారు. మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా ప్రస్తుతం 30%. భారత్‌ను తయారీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది సంస్థ ప్రణాళిక. 2022 నాటికి ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుతుందని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు