బాండ్.. జేమ్స్ బ్రాండ్

21 Nov, 2015 01:03 IST|Sakshi
బాండ్.. జేమ్స్ బ్రాండ్

జేమ్స్ బాండ్ సినిమాల్లో బ్రాండ్స్ హవా
* కార్ల నుంచి వాచీల దాకా అన్నీ బ్రాండెడ్
* ప్రొడ్యూసర్లకు, కంపెనీలకూ ప్రయోజనకరంగా డీల్స్
జేమ్స్‌బాండ్.. ఈ పేరే ఒక బ్రాండ్. సుమారు అయిదు దశాబ్దాల క్రితం నాటి సినిమా నుంచి ఇప్పటి స్పెక్టర్ దాకా బాండ్ ... తన స్టయిల్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు (కొన్ని సినిమాలు మినహాయిస్తే). మిగతా సినిమాలతో పోలిస్తే బాండ్ సినిమాల్లో బ్రాండ్‌ల హడావుడి కూడా ఎక్కువగానే ఉంటుంది.

చేతికి పెట్టుకునే వాచీల దగ్గర్నుంచీ రయ్యిన దూసుకెళ్లే కార్ల దాకా అన్నీ బ్రాండెడే. జేమ్స్ బాండ్ సినిమాల తయారీ నుంచి వాటి మార్కెటింగ్ దాకా ఈ ఉత్పత్తుల సంస్థల ప్రమేయమూ బాగానే ఉంటుంది. ఇది ఆర్థికంగా అటు నిర్మాతలకూ, ప్రచారపరంగా ఇటు ఆయా సంస్థలకూ ప్రయోజనకరంగా ఉంటున్నాయి.

ఉదాహరణకు.. బాండ్ సిరీస్‌లోనే అత్యంత  ఖరీదైనదిగా చెబుతున్న స్పెక్టర్ (నిర్మాణ వ్యయం సుమారు 194 మిలియన్ పౌండ్లని అంచనా) పోస్టర్‌లో బాండ్ ధరించిన ఎన్ పీల్ సంస్థ దుస్తులు హాట్ కేకులుగా అమ్ముడైపోయాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నందుకే.. డై అనదర్ డే లాంటి సినిమాకి ప్రొడ్యూసర్లతో.. ఏకంగా 21 బ్రాండ్ పార్ట్‌నర్స్ చేతులు కలిపారు. స్పెక్టర్ సినిమాలో కనీసం 17 బ్రాండ్ల ఉత్పత్తులు కనిపిస్తాయి. అందుకే.. హైనెకెన్ వంటి బ్రాండ్లు బాండ్ సినిమాతో అనుబంధం పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి.

స్కైఫాల్ సినిమా వ్యయంలో సుమారు మూడో వంతు (దాదాపు 28 మిలియన్ పౌండ్లు) ఇన్వెస్ట్ చేసిన హైనెకెన్ సంస్థ.. డేనియల్ క్రెగ్ తో కలిసి దాదాపు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జేమ్స్‌బాండ్‌లైఫ్‌స్టయిల్ పేరిట వెబ్‌సైటు కూడా ఉంది. జేమ్స్‌బాండ్ బ్రాండ్ విలువ దాదాపు 13 బిలియన్ పౌండ్లు ఉంటుందనేది లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ నిపుణుల అంచనా.   తాజాగా స్పెక్టర్ మూవీ రిలీజైన నేపథ్యంలో.. అందరి దృష్టినీ ఆకర్షించిన బ్రాండ్స్‌లో  ఇవి..
 
ఆస్టన్ మార్టిన్ కారు..
మొట్టమొదటిసారిగా 1964లో జేమ్స్ బాండ్ గోల్డ్‌ఫింగర్ సినిమాలో ఇది కనిపించింది. ఇది అప్పట్లో అఫీషియల్ బాండ్ కారుగా చెలామణీలోకి వచ్చింది. అప్పట్నుంచి 11 బాండ్ సినిమాల్లో ఈ కార్లు దర్శనమిచ్చాయి. తాజాగా బాండ్ సినిమాలో ఆస్టన్ మార్టిన్ డీబీ10, జాగ్వార్ సీ-ఎక్స్75 ఉన్నాయి. ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండవు. డీబీ 10 ధర దాదాపు 5,00,000 డాలర్ల పైగానే ఉంటుంది. ఇక జాగ్వార్ కారు 12 లక్షల డాలర్లు ఖరీదు చేస్తుంది.
 
ఒమేగా వాచ్..
బాండ్ చేతికి ప్రారంభంలో రోలెక్స్ వాచీలు కనిపించేవి. అయితే, 1995 తర్వాత నుంచి ఆ స్థానాన్ని ఒమేగా బ్రాండ్ ఆక్రమించింది. కెసినో రాయల్ సినిమాలో ఇందుకు సంబంధించి సంభాషణ కూడా ఉంటుంది. లేటెస్ట్‌గా స్పెక్టర్ సినిమాలో బాండ్ వాడిన ఒమేగా వాచ్ ఖరీదు 6,000 డాలర్ల పైమాటే!
 
టామ్ ఫోర్డ్ సూటు..
క్వాంటమ్ ఆఫ్ సొలేస్ సినిమా నుంచి జేమ్స్ బాండ్ అధికారిక టైలర్‌గా బ్రియోనీ స్థానాన్ని టామ్ ఫోర్డ్ దక్కించుకుంది. అప్పట్నుంచీ టామ్ ఫోర్డ్ సూట్లకు బాండ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు.
 
మార్టిని వోడ్కా..
వోడ్కా మార్టిని.. బాండ్ ఫేవరెట్ డ్రింక్. డైమండ్స్ ఆర్ ఫరెవర్ (1971) సినిమా నుంచి వోడ్కా మార్టినితో బాండ్‌కు అనుబంధం ఉంది. ఈ వోడ్కాను తయారు చేసే బెల్‌వెదర్ సంస్థ .. స్పెక్టర్ సినిమా కోసం ప్రొడ్యూసర్లతో భారీ డీల్ కుదుర్చుకుంది. అటు బీర్ తయారీ సంస్థ హైనెకెన్ కూడా సినిమాలో తమ బ్రాండ్ కనిపించేలా చూసుకునేందుకు గణనీయంగానే చెల్లించింది.

>
మరిన్ని వార్తలు