ఈ సారైనా అమ్ముడవుతుందా?

26 Aug, 2015 00:14 IST|Sakshi
ఈ సారైనా అమ్ముడవుతుందా?

మరోసారి అమ్మకానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ హోటల్
- రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా సఫలం కాని ప్రక్రియ
- గతంలో వచ్చిన రేటు ఇప్పుడు రాదంటున్న నిపుణులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
‘అసెట్ లైట్’ కార్యక్రమంలో భాగంగా జీఎంఆర్ గ్రూపు  హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌ను మరోసారి అమ్మకానికి పెట్టింది. ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్న ఈ హోటల్ విక్రయానికి... తాజాగా మరోసారి బిడ్డింగ్‌లను పిలవడంతో ఈ సారైనా  జీఎంఆర్ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు (జీహెచ్‌ఐఏఎల్) 100 శాతం అనుబంధ సంస్థగా ఉన్న జీఎంఆర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ‘నొవోటెల్’ పేరుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్వహిస్తోంది.

సరైన ఆక్యుపెన్సీ లేక భారీ నష్టాలతో నడుస్తున్న ఈ హోటల్‌ను అమ్మాలని కంపెనీ బోర్డు 2013లో నిర్ణయం తీసుకుంది కూడా. అప్పటి నుంచి అనేకమార్లు అమ్మకానికి ప్రయత్నించినా ఇంత వరకు సఫలం కాలేదు. గతంలో జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో రూ.300 కోట్లకు కొనుగోలు చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చినా... బోర్డులో సభ్యులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిడ్డింగ్ విధానంలో పారదర్శకత లోపించిందని, కనీసం రెండు దినపత్రికల్లోనైనా ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కంపెనీ హోటల్ విక్రయానికి సంబంధించి ప్రకటనలు జారీ చేసింది. తదనంతరం 12 సంస్థలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి.

హోటల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లేకుండా ఈ ప్రకటనలు జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు పూర్తి వివరాలతో మంగళవారం కొన్ని పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. 305 గదులున్న హోటల్ కనీస బిడ్డింగ్ ధర రూ. 213.5 కోట్లుగా సంస్థ పేర్కొంది. కనీసం రూ.500 కోట్ల నెట్‌వర్త్ కలిగిన సంస్థలు సెప్టెంబర్ 8 లోగా బిడ్డింగ్ చేయొచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రియల్ ఎస్టేట్ ధరలు తగ్గడం, వాణిజ్య కార్యకలాపాలు సన్నగిల్లడంతో గతంలో వచ్చిన రేటు కూడా ఇప్పుడు రావడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. 2009లో ప్రారంభమైన ఈ హోటల్‌ను ‘నొవోటెల్’ పేరుతో ’ఏక్కర్ గ్రూపు నిర్వహిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా