మగువల అందాన్ని పెంచుతున్న వన్‌గ్రామ్‌ జ్యువెల్లరీ

10 Mar, 2019 08:18 IST|Sakshi

బంగారు నగలకు దీటుగా డిమాండ్‌  

సాక్షి, కరీంనగర్‌ బిజినెస్‌: ఆభరణాలు అతివల అందాలను రెట్టింపు చేస్తాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో నగలతోనే హడావిడి ఉంటుంది. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న బంగారం ధరలతో ఆభరణాలు చేయించుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. చేయించుకున్నా వాటిని భద్రపర్చడం మరో సమస్యగా మారింది. ఈతరుణంలో మార్కెట్లో మహిళల కోసం వన్‌గ్రామ్‌ ఇమిటేషన్‌ జ్యువెల్లరీ నగలు అందరికీ ఆకర్షిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వీటికి మరింత గిరాకీ పెరిగింది. అచ్చుబంగారంలా కనిపించి వివిధ రకాల నూతన డిజైన్లలో లభ్యమవుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల మహిళలు మక్కువ చూపిస్తున్నారు. సంపన్నులను సైతం ఆకర్షించే డిజైన్లు ఉండడంతో రోజుకో డిజైన్‌ మార్చుతూ, సందర్భానికో ఆభరణం కొనుగోలు చేస్తున్నారు. ఇమిటేషన్‌ జ్యువెల్లరీ వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి మహిళల మనసుదోచే డిజైన్లను తెప్పించి సిద్ధంగా ఉంచుతుండటంతో గిరాకీ కూడా పెరుగుతోంది.
 

ఎన్నో రకాలు..
వన్‌గ్రాం గోల్డ్‌ ఆభరణాల కొనుగోలుకు ఉద్యోగినులు, గృహిణులతోపాటు కళాశాల విద్యార్థులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వన్‌గ్రాం గోల్ట్‌షాపులు పెళ్లిళ్ల సీజన్‌లో కలకలలాడుతున్నాయి. స్టోన్‌ నెక్లెస్, నల్లపూసల దండలు, గ్లాస్‌లాగెట్స్, రింగ్స్, ఒడ్డాలం, వంకీలు, ముత్యాల హారాలు, జడపోతలు, కెంపుల హారాలు, సీజెడ్‌ స్టోన్స్‌ ఆభరణాలు, పాపడ బిల్లలు, మాటీలు, గాజులు, వెడ్డింగ్‌ కలెక్షన్‌లు, లాంగ్‌చైన్‌లు, త్రీబైఫోర్‌ చైన్‌లు, రాంపరివార్‌ మ్యాట్‌గోల్డ్‌ నగలుతోపాటు వివిధ రకాల వన్‌గ్రామ్‌ గోల్డ్‌నగలు లభిస్తున్నాయి. వివిధ చీరలకు మ్యాచింగ్‌ అయ్యేలా సెట్టింగ్‌ స్పెషల్‌ గాజులు ప్రస్తుతం న్యూట్రెండ్‌గా మారింది. దీంతో వివాహాది శుభకార్యాల్లో మహిళలు తమ చీరలకు తగ్గట్టుగా ఉండే కలర్స్‌ సెట్స్‌ ఎక్కువగా వాడుతున్నారు. వ్యాపారులు ఢిల్లీ, హైద్రాబాద్, బెంగుళూర్, ఫెరోజాబాద్‌ వంటి ప్రాంతాల నుండి ప్రత్యేకంగా వన్‌గ్రాం ఆభరణాలు తెప్పిస్తున్నారు. పెళ్లిళ్లసీజన్‌లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. 

మక్కువ పెరుగుతోంది..
మహిళలను ఆకట్టుకునే వన్‌గ్రాం ఇమిటేషన్‌ జ్యూవెల్లరీలో సరికొత్త రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు ఇమిటేషన్‌ జ్యూవెల్లరీని ఇష్టపడుతున్నారు. ప్రత్యేకంగా వీటిని ఫెరోజాబాద్, ఢిల్లీ నుంచి ఆభరణాలు తెప్పిస్తాం. బ్యాంగిల్‌ సెట్స్‌తో మొదలుకొని అన్ని రకాల ఆభరణాలు మా వద్ద ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. 


– శ్రీదేవి, ఆకర్ష్‌ లేడీస్‌ ఎంపోరియం యజమాని 
 

కొత్త డిజైన్లు బాగున్నాయి..
వన్‌గ్రాం గోల్డ్‌ఐటమ్స్‌లో కొత్త డిజైన్లు బాగున్నాయి. చీరలకు మ్యాచింగ్‌గా ఉండే సెట్స్‌లో ఆకర్షణీయంగా వివిధ రకాల మోడల్స్‌ ఉన్నాయి. దీంతోపాటు నెక్లెస్‌లు, హారాలన్నీ మోడల్స్‌ కూడా అచ్చుబంగారంలా కనిపిస్తాయి. బంగారంతో చేసిన నగలున్నప్పటికీ ఇమిటేషన్‌ జ్యూవెల్లరీ కూడా సందర్భాన్ని బట్టి వాడుతుంటారు. కొత్త మోడల్స్‌ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రావడంతో కొనుగోలు చేస్తుంటా. 


– మనీషా, గృహిణి

మరిన్ని వార్తలు