ఇక బ్యాంకుల వంతు: ఆర్థిక మంత్రి జైట్లీ

30 Sep, 2015 00:20 IST|Sakshi
ఇక బ్యాంకుల వంతు: ఆర్థిక మంత్రి జైట్లీ

న్యూఢిల్లీ : ఆర్‌బీఐ పాలసీ రేట్లు తగ్గించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఇక రేట్ల కోత ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదలాయించాలని, తద్వారా పెట్టుబడులకు, ఎకానమీకి ఊతమివ్వడంలో తోడ్పడాలని ఆయన బ్యాంకులకు సూచించారు. రేట్ల తగ్గింపు వల్ల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు. ఎకానమీ కోలుకోవడానికి కావాల్సిన విధానపరమైన మద్దతు ఆర్‌బీఐ నిర్ణయంతో లభించగలదని జైట్లీ చెప్పారు.

పెట్టుబడులు మెరుగుపడితే దేశ వృద్ధి రేటు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం సాధ్యపడుతుందన్నారు. మరోవైపు,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ 7.6% నుంచి 7.4 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అంచనాలను సమీక్షిస్తుందని జైట్లీ చెప్పారు.

మరిన్ని వార్తలు