జీఎస్టీ తొలి బర్త్‌డే : పన్ను చెల్లింపుదారులు జంప్‌

30 Jun, 2018 11:13 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పన్ను విధానం జీఎస్టీ అమలు అయి రేపటికి(జూలై 1) ఏడాది పూర్తవుతోంది.  ఈ సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. జీఎస్టీని ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్నామని.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది పలు ప్రయోజనాలను చేకూర్చుతుందని కేంద్ర చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకే జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగారు. జీఎస్టీ అమల్లోకి వచ్చే నాటికి 63.76 లక్షలుగా ఉన్న పన్ను చెల్లింపుదారులు, ఇప్పటికి 1.12 కోట్లకు చేరుకున్నారని తెలిసింది. యాక్టివ్‌ పన్ను చెల్లింపుదారులు విపరీతంగా పెరగడం, అధికారిక రంగంలో మరిన్ని వ్యాపారాలు చేరాయని, ఆర్థిక వ్యవస్థలో అధికారీకరణ పెరుగుతుందనే దానికి సంకేతమని ఆర్థిక వేత్తలంటున్నారు. కొత్త పన్ను విధానంలో ఐటీ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ చాలా బాగుందని, యూజర్‌ అనుభవాన్ని, ఇంటర్‌ఫేస్‌ను మరింత మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

 ‘ప్రతి నెలా కోట్ల రూపాయల రిటర్నులు దాఖలవుతూ.. జీఎస్టీ విధానం ఎంతో విజయవంతంగా అమలవుతుండటం ఎంతో ఆనందదాయకం. తొలి ఏడాదిలోనే నెలకు సుమారు రూ.90 వేల కోట్ల సగటు రెవెన్యూలను ఇది ఆర్జించింది. ఏప్రిల్‌లో లక్ష కోట్లను ఇది అధిగమించింది.  ఇప్పటి వరకు 12 కోట్ల రిటర్నులు దాఖలు అయ్యాయి. 380  కోట్ల ఇన్‌వాయిస్‌లు ప్రాసెస్‌ అయ్యాయి. 1,12,15,693 మంది పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ సిస్టమ్‌లో నమోదయ్యారు. వీరిలో 63,76.967 మంది ముందస్తు పన్ను విధానం నుంచి ఈ కొత్త విధానంలోకి రాగ, మిగతా 48,38,726 మంది కొత్తగా పన్ను విధానంలోకి ప్రవేశించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను అంతకంతకు ఇది పెంచుతుంది‘ అని జీఎస్టీఎన్‌ చైర్మన్‌ ఏబీ పాండే తెలిపారు. యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడం, ఫైలింగ్‌ను సులభతరం చేయడం, తప్పుడు మెసేజ్‌లను అదుపులో ఉంచడం వంటి జీఎస్టీ విధానాన్ని మరింత విజయవంతంగా అమలయ్యేలా చేస్తున్నాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు