రిలయన్స్‌ డిజిటల్‌తో జతకట్టిన వన్‌ప్లస్‌

23 Oct, 2018 20:15 IST|Sakshi

రిలయన్స్‌ డిజిటల్‌తో వన్‌ప్లస్‌ సంస్థ కీలక భాగస్వామ్యం

రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో  ఇక వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

సాక్షి,న్యూఢిల్లీ: భారదేశంలో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై కన్నేసిన చైనా మొబైల్‌ తయారీదారు వన్‌ప్లస్‌ దేశంలోని దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థతో ఒక కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా వన్‌ ప్లస్‌  స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఇక మీదట రిలయన్స్ డిజిటల్  ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వన్‌ప్లస్‌ ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. అంతేకాదు దేశంలోని  పలు నగరాల్లో రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్ల ద్వారా  వన్‌ప్లస్‌  తాజా స్మార్ట్‌ఫోన్‌ 6టీ  ఆవిష్కరణ  ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.  

దేశంలోనే నెంబర్‌వన్‌, అతి వేగంగా విస్తరిస్తున్న కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌  సంస్థ  రిలయన్స్‌ డిజిటల్‌తో వన్‌ప్లస్  ఒప్పందాన్ని చేసుకుందని రిలయన్స్‌ డిజిటల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో  తాజా భాగస్వామ్యంతో  మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు వన్‌ప్లస్‌ ఇండియా జీఎం వికాస్‌ అగర్వాల్‌ ప్రకటించారు. భారతీయ నగరాల్లోని తమ మొబైల్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోఉండేలా మరిన్ని రిటైల్ టచ్ పాయింట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

వన్‌ ప్లస్‌ సంస‍్థతో భాగస్వామ్యం పట్ల రిలయన్స్ డిజిటల్ సంస్థ సీఈవో  బ్రయాన్ బేడ్  సంతోష వ్యక్తం చేశారు. తమ స్టోర్లలో వినియోగదారులకోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తామని  తద్వారా లైవ్‌ డెమో తోపాటు,  కస‍్టమర్లు తమ సందేహాలను తమ సిబ్బంది ద్వారా పత్యక్షంగా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.

న్యూయార్క్‌లో అక్టోబరు 29 వ తేదీ వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభానికి ముందు  ఈ భాగస్వామ్య ప్రకటన రావడం విశేషం.  అలాగే అక్టోబర్ 30 న న్యూఢిల్లీలో లాంచ్‌ చేయనుంది. ఇప్పటివరకు  టాటా గ్రూపునకు చెందిన  క్రోమా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో మాత్రమే లభ్యమయ్యే వన్‌ప్లస్‌స్మార్ట్‌ఫోన్లు ఇపుడు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి.

వన్‌ప్లస్‌ 6టీ ఫీచర్లు :  6.4 అంగుళాల డిస్‌ప్లే , 8జీబీ ర్యామ్‌, 256 జీబీస్టోరేజ్‌  3700ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు