దాని దూకుడు ముందు శాంసంగ్‌, ఆపిల్‌ ఔట్‌

1 Aug, 2018 12:02 IST|Sakshi
ఐఫోన్‌ 8 - గెలాక్సీ నోట్‌ 8 (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ఇన్ని రోజుల భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌(రూ.30,000 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌)లో టాప్‌ లీడర్లు ఎవరూ అంటే.. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌, అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌ పేర్లే చెప్పేవారు. కానీ ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టేసి, భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సరికొత్త లీడర్‌ దూసుకొచ్చింది. అదే చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజాగా వెల్లడించిన రిపోర్టులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో శాంసంగ్‌, ఆపిల్‌ను మించిపోయి వన్‌ప్లస్‌ లీడ్‌లోకి వచ్చినట్టు తెలిసింది.

మొట్టమొదటిసారి వన్‌ప్లస్‌ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు  కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. 2018 రెండో క్వార్టర్‌లో 40 శాతం మార్కెట్‌ షేరుతో వన్‌ప్లస్‌ ఈ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 బలమైన అమ్మకాలు.. వన్‌ప్లస్‌ను టాప్‌ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వన్‌ప్లస్‌ 6 రికార్డు షిప్‌మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది. 

అయితే దిగ్గజ కంపెనీలైన ఆపిల్‌, శాంసంగ్‌ షిప్‌మెంట్లు ఏడాది ఏడాదికి కిందకి పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. 34 శాతం షేరుతో శాంసంగ్‌ ఈ సెగ్మెంట్‌లో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది లాంచ్‌ చేసిన గెలాక్సీ ఎస్‌8 కంటే, గెలాక్సీ ఎస్‌9 షిప్‌మెంట్లు 25 శాతం పడిపోయాయి. షిప్‌మెంట్లు పడిపోయినప్పటికీ, ఫ్లాగ్‌షిప్‌ గెలాక్సీ ఎస్‌9 సిరీస్‌ ప్రమోషన్లు బలంగానే ఉన్నాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. మరోవైపు ఐఫోన్‌ 8, ఐఫోన్‌ ఎక్స్‌ లకు డిమాండ్‌ ఈ క్వార్టర్‌లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆపిల్‌ మార్కెట్‌ షేరు భారీగా పడిపోయింది. కేంద్రం డ్యూటీలను పెంచడంతో, ఆపిల్‌ కూడా తన ప్రొడక్ట్‌లపై ధరలను పెంచింది. దీంతో ఐఫోన్‌ 8, ఐఫోన్‌ ఎక్స్‌ సిరీస్‌ షిప్‌మెంట్లు క్షీణించాయి. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్‌ షేరు కూడా ప్రీమియం సెగ్మెంట్‌లో భారీగా పడిపోయి కేవలం 14 శాతం మాత్రమే నమోదైంది. 

అయితే మొత్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌ ఈ క్వార్టర్‌లో వార్షికంగా 19 శాతం పెరిగింది. ఈ సెగ్మెంట్‌లోకి హువావే(పీ20), వివో(ఎక్స్‌21), నోకియా హెచ్‌ఎండీ(నోకియా 8 సిరోకో), ఎల్‌జీ(వీ30 ప్లస్‌) స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు కొత్తగా వచ్చి చేరాయి. శాంసంగ్‌, వన్‌ప్లస్‌, ఆపిల్‌ టాప్‌-3 బ్రాండ్‌లు మొత్తం మార్కెట్‌ షేరు 88 శాతంగా ఉంది. ఇది ముందు క్వార్టర్‌లో 95 శాతంగా నమోదైంది.  
 

మరిన్ని వార్తలు