గెయిల్, ఐవోసీ నుంచి ఓఎన్‌జీసీ ఔట్‌!

24 Jan, 2018 02:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, గెయిల్‌లో తనకున్న వాటాలను విక్రయించడానికి ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) సిద్ధమయింది. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతి పొందింది. ‘‘మా ప్రతిపాదనకు కేంద్రం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. అయితే షేర్ల విక్రయానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం’’ అని ఓఎన్‌జీసీ వర్గాలు తెలియజేశాయి. ఈ వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు కోసం ఓఎన్‌జీసీ ఉపయోగించుకోనుంది.

దేశీయంగా అతి పెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఓఎన్‌జీసీకి 13.77 శాతం వాటాలున్నాయి. మంగళవారం నాటి షేరు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 26,200 కోట్లు. ఇక గెయిల్‌ ఇండియాలో ఓఎన్‌జీసీకి రూ.3,847 కోట్ల విలువ చేసే 4.86 శాతం వాటాలున్నాయి. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్‌ సంస్థ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసీఎల్‌) కేంద్ర ప్రభుత్వానికి చెందిన 51.11 శాతం వాటాలను ఓఎన్‌జీసీ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.36,915 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఓఎన్‌జీసీ దగ్గర ఇప్పటికే రూ.12,000 కోట్ల పైగా నగదు నిల్వలున్నాయి. హెచ్‌పీసీఎల్‌ కొనుగోలుకు సంబంధించి రూ. 18,060 కోట్ల రుణ సమీకరణ కోసం మూడు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయని స్టాక్‌ ఎక్సే్చంజీలకు వివరించింది. పీఎన్‌బీ నుంచి రూ. 10,600 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ. 4,460 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి రూ. 3,000 కోట్లు సమీకరిస్తున్నట్లు తెలిపింది.  

మరిన్ని వార్తలు