అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో ఓఎన్‌జీసీ విదేశ్‌కి వాటా

12 Feb, 2018 00:35 IST|Sakshi

ప్రధాని పర్యటనలో కుదిరిన ఒప్పందం ∙రూ.3,840 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్, దాని భాగస్వామ్య కంపెనీలు కలసి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్‌షోర్‌ చమురు క్షేత్రం(లోయర్‌ జుకమ్‌)లో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. ఈ కొనుగోలు విలువ 600 మిలియన్‌ డాలర్లు (రూ.3,840 కోట్లు). చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న యూఏఈలోకి ఓ భారత కంపెనీ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ప్రధాని మోదీ, అబుదాబి రాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఆల్‌ నహ్యాన్‌ సమక్షంలో ఈ శనివారం ఈ ఒప్పందం కుదిరింది.

ఓఎన్‌జీసీ విదేశ్‌తోపాటు ఐవోసీ, బీపీసీఎల్‌ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. రాయితీలతో కూడిన ఈ ఒప్పందం 40 ఏళ్లు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం లోయర్‌జుకమ్‌ ఆయిల్‌ ఫీల్డ్‌లో నిత్యం 4 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. 2025 నాటికి రోజుకు ఉత్పత్తిని 4.5 లక్షల బ్యారెళ్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం. ఓఎన్‌జీసీ గ్రూపు చైర్మన్‌ శశి శంకర్, అడ్‌నాక్‌ గ్రూప్‌ చీఫ్‌ సుల్తాన్‌ అహ్మద్‌ ఆల్‌ జబీర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. మరో 30% వాటా కొనుగోలుకు సామర్థ్యం కలిగిన భాగస్వాముల ఎంపిక జరుగుతోందని ఆల్‌ జబీర్‌ పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు