ఓఎన్‌జీసీ లాభం 6,144 కోట్లు 

3 Aug, 2018 01:02 IST|Sakshi

నాలుగున్నరేళ్ల కాలంలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభం  

కలసి వచ్చిన చమురు,  గ్యాస్‌ ధరల పెరుగుదల  

43 శాతం వృద్ధితో రూ.27,213 కోట్లకు మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: చమురు, గ్యాస్‌ ధరలు పెరగడం ఓఎన్‌జీసీకి లాభాల పంట పడించింది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.6,144 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ.3,885  కోట్లు)తో పోల్చితే 58 శాతం వృద్ధి సాధించామని ఓఎన్‌జీసీ తెలిపింది. నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కంపెనీకి ఇదే అత్యధిక త్రైమాసిక లాభం. 2013, డిసెంబర్‌ క్వార్టర్‌లో ఈ కంపెనీ రూ.7,126 కోట్ల నికర లాభం సాధించింది. నికర లాభం ఒక్కో షేర్‌ పరంగా రూ.3.03 నుంచి రూ.4.79కి పెరిగిందని పేర్కొంది. ఇక ఈ క్యూ1లో కార్యకలాపాల ఆదాయం 43 శాతం వృద్ధితో రూ.27,213 కోట్లకు ఎగసిందని ఓఎన్‌జీసీ వివరించింది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన చూస్తే, 14 శాతం వృద్ధి సాధించామని తెలిపింది.  ఇబిటా రూ.8,775 కోట్ల నుంచి 58 శాతం వృద్ధితో రూ.రూ.13,893 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ మార్జిన్‌ క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 47.4 శాతం నుంచి 54 శాతానికి పెరిగిందని తెలిపింది.  

48 శాతం పెరిగిన రియలైజేషన్‌.. 
ఒక్కో బ్యారెల్‌ ముడి చమురు ఉత్పత్తిపై 71.48 డాలర్ల రియలైజేషన్‌ను ఈ క్యూ1లో  సాధించామని ఓఎన్‌జీసీ తెలిపింది. గత క్యూ1లో సాధించిన రియలైజేషన్‌ (48.42 డాలర్లు)తో పోల్చితే ఇది 48 శాతం అధికమని వివరించింది. సహజ వాయువు రియలైజేషన్‌ 2.48 డాలర్ల నుంచి 3.06 డాలర్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో ముడి చమురు ఉత్పత్తి 5 శాతం తగ్గి 5 మిలియన్‌ టన్నులకు చేరిందని పేర్కొంది. అయితే జాయింట్‌ వెంచర్‌ చమురు క్షేత్రాల్లో ముడి చమురు ఉత్పత్తి 2.5 శాతం పెరిగిందని వివరించింది. సహజ వాయువు ఉత్ప్తతి 3.4 శాతం వృద్ధితో 5.9 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు పెరిగిందని పేర్కొంది.   రాయల్టీపై సర్వీస్‌ ట్యాక్స్, జీఎస్‌టీ కింద రూ.2,695 కోట్లు ప్రభుత్వానికి  చెల్లించామని ఓఎన్‌జీసీ వెల్లడించింది. . అయితే రాయల్టీపై సర్వీస్‌ ట్యాక్స్‌/జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణుల అభిప్రాయమని, ఈ మేరకు సంబంధిత అధికారులకు తెలిపామని, అయినా ముందు జాగ్రత్త చర్యగా ఈ మొత్తాన్ని చెల్లించామని తెలిపింది. 
 ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్‌ 0.4 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. 

>
మరిన్ని వార్తలు