ఓఎన్జీసీ నుంచి బోనస్ ఇష్యూ

28 Oct, 2016 00:43 IST|Sakshi
ఓఎన్జీసీ నుంచి బోనస్ ఇష్యూ

రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటన
నికరలాభం 6 శాతం వృద్ధి

 న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఓఎన్‌జీసీ లాభం 6 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే కాలంలో రూ.4,681 కోట్ల లాభం రాగా, తాజాగా అది రూ.4,975 కోట్లకు పెరిగింది. ఆదాయం 3.4 శాతం వృద్ధితో రూ.18,395 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయండ రూ.17,785 కోట్లు. ఇబిటా 7.9 శాతం పెరిగి రూ.9,100 కోట్లుగా ఉంది. వాటాదారుల వద్దనున్న ప్రతి రెండు షేర్లకు ఒక షేర్ బోనస్‌గా ఇవ్వాలని కంపెనీ డెరైక్టర్ల బోర్డు నిర్ణయించింది.

కంపెనీలో 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, దానికంటే ముందు ఈక్విటీ పెంచే దిశగా బోనస్ జారీకి కంపెనీ నిర్ణయించడం గమనార్హం. అలాగే, రూ.5 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.4.50ను మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ఇందుకు నవంబర్ 5 రికార్డు తేదీగా ఖరారు చేసింది. ఓఎన్‌జీసీ చివరిసారిగా 2010 డిసెంబర్‌లో బోనస్ షేర్లను ఇచ్చింది. ఇన్వెస్టర్ల వద్దనున్న ప్రతీ షేరుకు ఒక షేరు బోనస్‌గా కేటాయించింది. అదే సమయంలో ప్రత్యేక డివిడెండ్‌గా రూ.32 రూపాయలు ఇవ్వడంతోపాటు రూ.10 ముఖ విలువ ఉన్న షేరును రూ.5గా విభజించింది.

మరిన్ని వార్తలు