ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

14 Aug, 2019 11:09 IST|Sakshi

న్యూఢిల్లీ: తగ్గిన  చమురు ధరల ప్రభావం ఓఎన్‌జీసీ లాభాలపై పడింది. అయినప్పటికీ లాభాల క్షీణతను 4 శాతానికి పరిమితం చేసి జూన్‌ క్వార్టర్‌లో రూ.5,904 కోట్లను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,144 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 2.4 శాతం తగ్గి రూ.26,555 కోట్లకు పరిమితం అయింది. ప్రతీ బ్యారెల్‌ చమురును ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా రూ.66.30 డాలర్లను ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది ప్రతీ బ్యారెల్‌పై 71.49 డాలర్లుగా ఉంది. సహజ వాయివు ధర మాత్రం ప్రతీ మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌పై 3.69 డాలర్లకు పెరిగింది. చమురు ఉత్పత్తి 5 శాతం వరకు తగ్గి 4.8 మిలియన్‌ టన్నులుగా ఉందని, దీర్ఘకాలంగా ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాల్లో ఉత్పత్తి సహజంగానే తగ్గిందని తెలిపింది. సహజ వాయివు ఉత్పత్తి మాత్రం 4 శాతం పెరిగి 6.15 బిలియన్‌ క్యుబిక్‌ మీటర్లుగా ఉన్నట్టు వెల్లడించింది. జూన్‌ త్రైమాసికంలో కొత్తగా నాలుగు క్షేత్రాల్లో నిక్షేపాలను గుర్తించినట్టు తెలిపింది. మంగళవారం బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేరు 1.72% దిగజారి రూ. 128 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ.126ని తాకింది.

మరిన్ని వార్తలు