ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌కు గ్యాస్‌ ధరల్లో స్వేచ్ఛ!

21 Feb, 2019 01:03 IST|Sakshi

ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహకాలు

కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: ఉత్పత్తి లాభసాటి కాదని గ్యాస్‌ క్షేత్రాలను పక్కన పెట్టిన ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌... వాటి విషయంలో పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తిని పెంచేందుకు ధరల్లో స్వేచ్ఛనివ్వటం, తక్కువ రాయల్టీని వసూలు చేయటం వంటి కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. అన్వేషణ పూర్తయి అభివృద్ధి చేయాల్సిన క్షేత్రాల విషయంలో ఈ కంపెనీలకు ధరల పరంగా పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది. అలాకాకుండా ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాల్లో గనక ఉత్పత్తిని పెంచితే... వాటిపై తక్కువ రాయల్టీని వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ కొత్త అన్వేషణ విధానాన్ని ఆమోదించామని, ఇందులో దేశీయంగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని పెంచేందుకు పలు ప్రోత్సాహకాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓఎన్‌జీసీ 12 ఆవిష్కరణలను (గ్యాస్‌/చమురు క్షేత్రాల్లో) ఉత్పత్తి లేకుండా పక్కన పెట్టింది.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుత ధరల కంటే ఈ క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. రిలయన్స్‌ ఈస్ట్‌కోస్ట్‌ బ్లాక్‌ ఎన్‌ఈసీ–25 వద్ద ఆవిష్కరణల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలకు కేటాయించిన క్షేత్రాల్లో అదనపు ఉత్పత్తిపై 10% రాయల్టీ తగ్గింపు ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి అధిక వాటా ఆఫర్‌ చేసే కంపెనీలకు చమురు, గ్యాస్‌ బ్లాక్‌లను కేటాయించే ప్రస్తుత విధానం నుంచి, గతంలో అనుసరించిన అన్వేషణ పనితీరు ఆధారిత కేటాయింపులకు మళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించాయి. ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని గుర్తించిన కేటగిరీ–1లోని బ్లాక్‌లను పనితీరుతోపాటు 70:30 రేషియోలో వాటాల పంపిణీపై కేటాయించనున్నట్టు తెలిపాయి. 2, 3వ కేటగిరీల్లోని బ్లాక్‌లను మాత్రం పూర్తిగా కంపెనీల అన్వేషణ, ఉత్పత్తి పనితీరు ఆధారంగానే కేటాయించనున్నట్టు చెప్పాయి. 

మరిన్ని వార్తలు