ఐటీ దాడులు : దిగొచ్చిన ఉల్లి ధరలు

16 Sep, 2017 15:46 IST|Sakshi
సాక్షి, నాసిక్‌: ఉల్లి ధరలు భారీగా కిందకి దిగొచ్చాయి. లాసల్గావ్‌ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ) వద్దనున్న దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లి ధరలు సుమారు 35 శాతం వరకు తగ్గాయి. ఈ మేర ధరలు తగ్గడానికి ప్రధాన కారణం నాసిక్‌లో ఉల్లి ట్రేడర్లకు సంబంధించిన ఏడుగురిపై  ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వర్తించడమే.  ఏడుగురు అగ్ర ఉల్లి ట్రేడర్లకు సంబంధించి లాసల్గావ్‌, నాసిక్‌ జిల్లాల సమీప ప్రాంతాల్లో 25 ప్రదేశాల్లో ఐటీ దాడులు నిర్వర్తించింది. నాసిక్‌ యూనిట్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 120 మంది అధికారులు ఈ సెర్చ్‌, సర్వే ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు ఓ సీనియర్‌ ఐటీ అధికారి చెప్పారు.
 
లాసల్గావ్‌ ఉల్లి ట్రేడర్ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తాము సేకరించినట్టు చెప్పారు. భవిష్యత్తులో ధరలను పెంచడానికి ఉత్పత్తిని మార్కెట్‌లకు రానియకుండా ఆపుతున్నారు. వాటిని అక్రమంగా నిల్వ ఉంచుతున్నట్టు తెలిపారు. ధరలు పడిపోయినప్పటి నుంచి వ్యవసాయదారుల నుంచి ఉల్లిని ట్రేడర్లు కొని, తర్వాత వాటిని ఎక్కువ ధరలకు మార్కెట్‌లో అమ్ముతున్నట్టు అధికారి పేర్కొన్నారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నాయని కూడా అధికారులు చెప్పారు.  
 
మరిన్ని వార్తలు