‘ఆన్‌లైన్’ పండుగ..!

14 Oct, 2015 00:24 IST|Sakshi
‘ఆన్‌లైన్’ పండుగ..!

బెంగళూరు/ముంబై: ఈ పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ వ్యాపారం వేడెక్కుతోంది. ఈ కామర్స్ దిగ్గజాల, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ సంస్థలు భారీ స్థాయిలో అమ్మకాలే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఫ్లిప్‌కార్ట్ సంస్థ ద బిగ్ బిలియన్ డేస్ పేరుతో పండుగల సీజన్ అమ్మకాలను మంగళవారం నుంచి ప్రారంభించింది.  పోటీ సంస్థలు, స్నాప్‌డీల్, అమెజాన్  సంస్థలు ఈ పండుగ సీజన్‌ను ఒక పేరుతో బ్రాండింగ్ చేయకపోయినా, ఇవి కూడా వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నాయి.

ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదంటూ పండుగల సీజన్ కొనుగోళ్ల కోసం ఫ్లిప్‌కార్ట్ భారీ ప్రచారం నిర్వహిస్తోంది. దాదాపు పది లక్షల ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇస్తామని అంటోంది. ప్రతీ గంటకు కొత్త ఆఫర్లిస్తామని స్నాప్‌డీల్, రోజూ 1 కేజీ బంగారం గెల్చుకునే అవకాశముందని, ఒక్క రోజులోనే డెలివరీ ఇస్తామని అమెజాన్ ఇండియాలు ఊరిస్తున్నాయి.
 
10 గంటల్లో 10 లక్షల వస్తువుల అమ్మకాలు
13వ తేదీన 10 గంటల్లో పది లక్షలకు పైగా వస్తువులను విక్రయించామని దేశవ్యాప్తంగా 60 లక్షల హిట్స్ వచ్చాయని, ఒక సెకన్‌కు 25 వస్తువులను అమ్మామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మెట్రో నగరాల్లో బెంగళూరు, ఢిల్లీ, చెన్నైల నుంచి, ఇతర నగరాల్లో లూధియానా, లక్నో, భోపాల్‌ల నుంచి ఎక్కువగా హిట్స్ వచ్చాయని పేర్కొంది.

ఇప్పటివరకూ పాదరక్షలు, పురుషుల దుస్తులు, యాక్సెసరీలు బాగా అమ్ముడయ్యాయని ఫ్లిప్‌కార్ట్ హెడ్ ముకేష్ బన్సాల్ చెప్పారు.  గత రెండు రోజుల్లో 16 లక్షల యాప్ డౌన్‌లోడ్‌లు  జరిగాయని, 70 కేటగిరీల్లో 3 కోట్ల వస్తువులను ఆఫర్ చేసున్నట్లు పేర్కొన్నారు.
 
ఉదయమే డెలివరీ అమెజాన్
అర్ధరాత్రి వరకూ ఆర్డర్ చేసిన వస్తువులను మరునాడు ఉదయం 11 గంటలలోపు డెలివరీ చేసే మార్నింగ్ డెలివరీ సర్వీస్‌ను అమెజాన్ అంది స్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ/ఎన్‌సీఆర్, ముంబైల్లో ఈ మార్నింగ్ డెలివరీ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ హెడ్ అక్షయ్ సాహి చెప్పారు. ఆర్డర్‌కు రూ.120 ఫ్లాట్ చార్జీతో ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఉదయం 11 గంటలలోపు ఆర్డర్ చేస్తే, ఆ వస్తువులను అదే రోజు డెలివరీ చేసే వెసులుబాటు కూడా ఉందని వివరించారు.

మరిన్ని వార్తలు