ఆన్‌లైన్‌ గ్రోసరీ బిజినెస్‌ హైజంప్‌!

22 May, 2020 09:32 IST|Sakshi

లాక్‌డవున్‌లో భారీ ఆర్డర్లు

ఈ ఏడాది 3 బిలియన్‌ డాలర్లకు

హోమ్‌ డెలివరీల దన్ను

దేశీయంగా కరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా పలు రంగాలు డీలాపడినప్పటికీ.. ఆన్‌లైన్‌ గ్రోసరీ బిజినెస్‌ మాత్రం జోరందుకుంది. వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో హోమ్‌ డెలివరీలు చేసే ఆన్‌లైన్‌ గ్రాసరీ మార్కెట్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో బిగ్‌ బాస్కెట్‌, గ్రోఫర్స్‌ తదితర సంస్థల బిజినెస్‌ ఊపందుకుంది. కోవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది ఆన్‌లైన్‌ గ్రోసరీ మార్కెట్‌ 76 శాతం జంప్‌చేయనున్నట్లు ఫారెస్టర్‌ రీసెర్చ్‌ తాజాగా అభిప్రాయపడింది. వెరసి 3 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 22,500 కోట్లు)ను తాకనున్నట్లు అంచనా వేసింది. దేశవ్యాప్త లాక్‌డవున్‌ కారణంగా ఈకామర్స్‌ బిజినెస్‌కు 1.3 బిలియన్‌ డాలర్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు ఫారెస్టర్‌ అంచనా వేసింది. దీంతో తొలుత వేసిన 2 బిలియన్‌ డాలర్ల ఆన్‌లైన్‌ గ్రోసరీస్‌ బిజినెస్‌ 3 బిలియన్‌ డాలర్లను అధిగమించవచ్చని అభిప్రాయపడింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితర కంపెనీలు సైతం వినియోగదారులకు ఆన్‌లైన్‌ ద్వారా కిరాణా సరుకులను అందిస్తున్న విషయం విదితమే.

35.5 బిలియన్‌ డాలర్లకు
ఈఏడాది దేశీయంగా మొత్తం ఈకామర్స్‌ బిజినెస్‌ 6 శాతం వృద్ధితో 35.5 బిలియన్‌ డాలర్లను తాకనున్నట్లు అంచనా. అయితే గత ఆరు వారాలుగా ఈకామర్స్‌ బిజినెస్‌లో నమోదైన అధిక డిమాండ్‌ కొనసాగకపోవచ్చని ఫారెస్టర్‌ రీసెర్చ్‌ పేర్కొంది. లాక్‌డవున్‌ తొలి రోజుల్లో బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్స్‌ వంటి కంపెనీలకు ఐదు రెట్లు అధికంగా ఆర్డర్లు లభించినప్పటికీ ఇటీవల నెమ్మదించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే మరికొంతకాలంపాటు ఈకామర్స్‌ బిజినెస్‌లో అమ్మకాల పరిమాణం అధికంగానే నమోదయ్యే వీలున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 35 శాతం అధికంగా ఆర్డర్లు లభిస్తున్నట్లు బిగ్‌బాస్కెట్‌ సీఈవో హరి మీనన్‌ పేర్కొన్నారు. కోవిడ్‌-19కు ముందు బిజినెస్‌తో పోలిస్తే లాక్‌డవున్‌ కాలంలో 60 శాతం అధిక విలువగల ఆర్డర్లు లభించినట్లు గ్రోఫర్స్‌ సీఈవో అల్వీందర్‌ తెలియజేశారు. 

మరిన్ని వార్తలు