ఫైనల్‌ లే అవుట్‌ రాలేదా? రెరాలో నమోదు తప్పనిసరి!

15 Jul, 2017 01:51 IST|Sakshi
ఫైనల్‌ లే అవుట్‌ రాలేదా? రెరాలో నమోదు తప్పనిసరి!

విక్రయాలు జరిపే రియల్టీ పోర్టల్స్‌ కూడా రెరా పరిధిలోకే
డెవలపర్లే కాదు.. బ్రోకర్లు, ఏజెంట్లూ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే
రెరా అమలుతో రియల్టీ బ్రాండ్‌ అంబాసిడర్లూ ప్రకటనల్లో జాగ్రత్త


సాక్షి, హైదరాబాద్‌
దశాబ్దం క్రితం స్థానిక సంస్థల నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకొని లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు విక్రయించేసి.. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ లైన్ల వంటి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జారుకున్నారు డెవలపర్లు. ఫైనల్‌ లే అవుట్‌ అనుమతులనూ తీసుకోలేదు. అయితే త్వరలోనే తెలంగాణలో అమల్లోకి రానున్న రెరా నిబంధనల్లో ఫైనల్‌ లే అవుట్‌ తీసుకొని వెంచర్లను కూడా రెరా పరిధిలోకి చేర్చారు. దీంతో ఆయా లే అవుట్లలో ఇప్పుడు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆర్డర్లను ధిక్కరిస్తే..
రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, ఏజెంట్లు రెరా అథారిటీ నుంచి లైసెన్స్‌ తీసుకోవాలి. ఆ రాష్ట్రంలో మాత్రమే ప్లాట్ల క్రయ విక్రయాలు చేపట్టాలి. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లోనూ స్థలాలను విక్రయించాలంటే సంబంధిత రాష్ట్రంలోని రెరా అథారిటీ నుంచి లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రెరా వద్ద నమోదు చేయని ఫ్లాట్లను గానీ ప్లాట్లను గానీ విక్రయించడానికి వీల్లేదు. కేవలం రెరాలో నమోదు చేసుకున్న లే అవుట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు, బ్రోకర్లు రెరాలో నమోదు చేసుకోని పక్షంలో ప్రతి రోజూ రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. రెరా నిబంధనలను పాటించకపోతే ప్లాట్‌ విలువలో 5 శాతం జరిమానా, అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ ఆర్డర్లను దిక్కరిస్తే మాత్రం ప్లాట్‌ విలువ 10 శాతం జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష. రెండూ కూడా విధించవచ్చు.

టైటిల్‌ గ్యారెంటీ ఇవ్వాల్సిందే..
హెచ్‌ఎండీఏ పరిధిలోనే కాదు డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) పరిధిలోని లే అవుట్లను కూడా రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందే. కొనుగోలుదారులకు టైటిల్‌ గ్యారెంటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పైగా లే అవుట్లలో చేసే మౌలిక వసతులకు ఐదేళ్ల గ్యారెంటీ బాధ్యత కూడా డెవలపర్లదే. బ్రోచర్‌లో పేర్కొన్న విధంగా వెంచర్‌లోని అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేయాలి. లేకపోతే స్థల యజమానే కాదు ఏజెంటూ బాధ్యత వహించాల్సి వస్తుంది. ‘‘అనుమతుల, పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసే ప్రభుత్వం మాత్రం డెవలపర్‌కు టైటిల్‌ గ్యారెంటీ ఇవ్వదు. కానీ, డెవలపర్‌ మాత్రం కొనుగోలుదారులకు ఇవ్వాలనడం సరైంది కాదని’’ రామ్‌ డెవలపర్స్‌ ఎండీ వనపర్తి రాము తెలిపారు.

విక్రయాలు జరిపే పోర్టల్స్‌ రెరా పరిధిలోకే...
ఆన్‌లైన్‌ ప్రాపర్టీ పోర్టల్స్‌ అడ్వరై్టజ్‌మెంట్‌ మాత్రమే చేస్తే రెరాలో నమోదు అవసరం లేదు. ఒకవేళ ఆయా పోర్టల్స్‌ డెవలపర్ల నుంచి కమీషన్‌ తీసుకొని ప్రాపర్టీలను విక్రయిస్తే మాత్రం రెరాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌ రెడ్డి తెలిపారు. ప్రకటనల విషయంలోనూ పోర్టల్స్‌ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్ట్‌లు, వెంచర్లను మాత్రమే ప్రచారం చేయాల్సి ఉం టుంది. అలాగే పత్రికలు, ప్రసార మాధ్యమాలు సైతం ఆయా ప్రాపర్టీలకు రెరా నంబరుం టేనే ప్రకటనలను తీసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో కొనుగోలుదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ధరలు పెంచనున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లు..
రెరాలో భవన నిర్మాణ కాంట్రాక్టర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రెరా అమలయ్యాక నిర్మాణ గ్యారెంటీ విషయంలో మాత్రం డెవలపర్‌కు, కాంట్రాక్టర్లకు మధ్య జరిగే ఒప్పంద పత్రంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, డెవలపర్ల మధ్య జరిగే ఒప్పంద పత్రంలో చ.అ. ధరలు, నిర్వహణ బాధ్యతలు తదితరాలుంటాయి. కానీ, రెరా అమలు తర్వాతి నుంచి భవన నిర్మాణ నాణ్యత విషయంలోనూ కాంట్రాక్టర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఓ డెవలపర్‌ తెలిపారు.

ఎందుకంటే కొనుగోలుదారులకు నిర్మాణ గ్యారెంటీ బాధ్యత వహించేది డెవలపర్లే కాబట్టి! దీంతో ఇప్పటివరకు ఏడాది లీకేజీ నిర్వహణ బాధ్యతలకు మాత్రమే పరిమితమైన ఒప్పంద పత్రం నిబంధనల్లో రెరాతో ఐదేళ్ల గ్యారెంటీ నిబంధన కూడా ఉంటుందని తెలిపారు. అయితే నిర్వహణ కాలపరిమితి పెరగడంతో నిర్మాణ ధరలనూ పెంచక తప్పని పరిస్థితి అని కాంట్రాక్టర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ సచితానంద్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సాధారణ నిర్మాణాలకు చ.అ.కు రూ.1,200, ఏడంతస్తుల వరకైతే రూ.1,350, ఆపైన నిర్మాణాలకైతే రూ.2 వేలపైమాటే చార్జీలున్నాయి. ఇవి రెరా అమలు తర్వాతి నుంచి సుమారు చ.అ. రూ.50–100 పెరుగుతాయని పేర్కొన్నారు.

రియల్టీ బ్రాండ్‌ అంబాసిడర్లూ జాగ్రత్త..
ఈ మధ్య కాలంలో స్థిరాస్తి సంస్థలు బ్రాండ్‌ అంబాసిడర్లను నియమించుకునే సంస్కృతి పెరిగింది. అయితే గతంలో లాగా అంబాసిడర్లు కేవలం ప్రాజెక్ట్‌ వారీగా ఒప్పందం చేసుకుంటే సరిపోదు. రెరా అమలయ్యాక సంబంధిత ప్రాజెక్ట్‌ రెరాలో రిజిస్టరైందా? అనుమతి పత్రాలన్నీ సరిగా ఉన్నాయా? బ్రోచర్‌లో పేర్కొన్న హామీలనే ప్రకటనల్లోనూ చెబుతున్నాడా? వంటి అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. లేకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించే కొనుగోలుదారులకు బ్రాండ్‌ అంబాసిడర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు బ్రోచర్‌లో లేని హామీలను సైతం బ్రాండ్‌ అంబాసిడర్ల చేత ప్రకటనలు చేయిస్తుంటారు. వీటికి ఆకర్షితులైన కస్టమర్లు కొనుగోళ్లు చేసేశాక.. హామీలు నెరవేర్చలేదనే కారణంగా ఫోరంను ఆశ్రయిస్తే గనక ప్రకటనల్లో నటించినందుకు గాను బ్రాండ్‌ అంబాసిడర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున వర్సిటీ పక్కన ఖాజా గ్రామంలో రామకృష్ణ హౌజింగ్‌ నిర్మిస్తున్న వెనుజియా ప్రాజెక్ట్‌కు మహేశ్‌బాబు, హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో డ్రీమ్‌ ఇండియా నిర్మిస్తున్న డ్రీమ్‌ రిసార్ట్‌కు అనిల్‌ కపూర్, సువర్ణ భూమి సంస్థకు ఎస్పీ బాల సుబ్రమణ్యం, కె విశ్వనాథ్‌లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు