ఆన్‌లైన్ షాపర్లు పెరుగుతున్నారు..

14 Apr, 2014 01:13 IST|Sakshi
ఆన్‌లైన్ షాపర్లు పెరుగుతున్నారు..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక సేవల రంగ సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో 1.03 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్లు ఉన్నారు. 2015 నాటికి వీరి సంఖ్య 3.8 కోట్లకు చేరుతుందని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అధ్యయనంలో తేలిం ది. ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా 7.4 కోట్లుంది. ఇంటర్నెట్ యూజర్ల పరంగా గతేడాది ఆగస్టులో జపాన్‌ను వెనక్కినెట్టి మూడవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. చైనా, అమెరికాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

 క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ కొనుగోళ్లను చూస్తే ఫ్లిప్‌కార్ట్‌పై రెండింతలు, జబాంగ్ 1.6 రెట్లు, ఇన్ఫిబీమ్ ఆరింతలు లావాదేవీలు పెరిగాయి. గూగుల్ ఇటీవల చేపట్టిన గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన రావడంతో ఆన్‌లైన్ రిటైలర్లకు, క్రెడిట్  కార్డు సంస్థలకు ప్రయోజనం చేకూరింది. క్రెడిట్‌కార్డుదారుల సంఖ్య 2013-14లో 4% పెరిగిందని చెల్లింపులు, లావాదేవీ సేవలందించే వరల్డ్‌లైన్ అంటోంది. మొత్తం క్రెడిట్ కార్డుల్లో 54% ప్రైవేటు బ్యాంకులు జారీ చేసినవే.

 కాగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోందని, అదే విధంగా ఆన్‌లైన్ షాపింగ్ కూడా పెరుగుతోందని నిపుణులంటున్నారు. సమయం ఆదా కావడం, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా కోరుకున్న వస్తువు లభ్యమవుతుండడం, ధర అందుబాటులో ఉండడం, సొమ్ము చెల్లింపులు సులభంగా ఉండడం, కొన్ని సంస్థలు నెలవారీ సమాన వాయిదాలు (ఈఎంఐ)లు ఆఫర్ చేస్తుండడం తదితర కారణాల వల్ల ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతోందని వారంటున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా మహిళలతో సహా పలువురు ముఖ్యంగా యువ ఉద్యోగులు ఆన్‌లైన్ షాపింగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు