చౌకవైనా.. భేషైనవి

22 Jun, 2014 02:31 IST|Sakshi
చౌకవైనా.. భేషైనవి

మొట్టమొదటి పూర్తిస్థాయి ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన కంపెనీ ఉద్యోగిని కావడంతో.. వీటి ప్రీమియాల గురించి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులు, కస్టమర్ల నుంచి అనేక ప్రశ్నలు నాకు ఎదురవుతుంటాయి. ఇంత చౌకగా ఉందంటే.. కచ్చితంగా ఎక్కడో ఏదో ఒక లొసుగు ఉండే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా క్లెయిముల విషయానికొచ్చినప్పుడు కంపెనీలు ఏదో ఒక రకంగా ఎగ్గొట్టేస్తాయేమోనన్న భయం అన్నింటినీ మించి ఎక్కువగా కనిపిస్తుంటుంది.
 
అయితే, ఇంతకు మించిన అనవసర భయం మరొకటి లేదని చెప్పవచ్చు. జీవిత బీమా వ్యాపారం అనేది దీర్ఘకాలికమైనది. క్లెయిములు సరిగ్గా చెల్లించదన్న ప్రచారం జరిగిందంటే ఏ కంపెనీ కూడా మార్కెట్లో మనుగడ సాగించలేదు. అందువల్ల, సిసలైన క్లెయిములన్నిటినీ చెల్లించడం తమ బాధ్యతన్న విషయం ప్రతి కంపెనీ గుర్తెరిగి వ్యవహరిస్తుంది. ఆన్‌లైన్ ప్రపోజల్ ఫారంలో కంపెనీ బోలెడన్ని వివరాలు సేకరిస్తుంది కాబట్టి సిసలైన క్లెయిమును నిరాకరించడానికి అసలు అవకాశమే లేదు.

మరి సంప్రదాయ పాలసీలతో పోలిస్తే ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్ ఎందుకు చౌకగా ఉంటుందంటే...
 
* అమ్మకాలపరంగా మధ్యలో ఎవరికీ కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కంపెనీకి పంపిణీ ఖర్చులు తగ్గిపోతాయి. దీంతో ప్రీమియంను తక్కువ చేయొచ్చు.
* పాలసీ జారీ ప్రక్రియలో సింహభాగం ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. పేపర్, స్టేషనరీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రయోజనాన్ని పాలసీదారుకు బదలాయించడానికి సాధ్యపడుతుంది.
* ఆన్‌లైన్ కస్టమర్ల ప్రొఫైల్‌ని బట్టి పాలసీలు తీసుకునే వారి సగటు జీవితకాలం, వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలపై అంచనాలు మెరుగుపడగలవు. తర్వాత కాలంలో ప్రీమియంలను క్రమబద్ధీకరించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
 
ఇన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్లు ఆఫ్‌లైన్ ప్లాన్ల కన్నా చౌకగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాలసీలు.. అందుబాటు ప్రీమియంలతో గణనీయమైన జీవిత బీమా కవరేజీ అందిస్తూ చెప్పుకోతగిన సేవలందిస్తున్నాయి. కనుక కస్టమరు చేయాల్సిందల్లా తమకు ఎంత కవరేజీ కావాలో నిర్ణయించుకోవడం, కొన్ని సులభతరమైన ప్రశ్నలకు సమాధానమివ్వడం, కీలకమైన వివరాలేమీ దాచిపెట్టకుండా తెలియజేయడం, అటుపైన ప్రీమి యం చెల్లించడమే. తద్వారా కుటుంబానికి తగినంత ఆర్థికపరమైన భద్రత కల్పించారు కనుక.. ఇక ఆ తర్వాత నిశ్చింతగా కాలు మీద కాలేసుకుని ధీమాగా ఉండొచ్చు.

మరిన్ని వార్తలు