ప్లాస్టిక్ మనీ జోరు..!

24 Apr, 2014 01:30 IST|Sakshi
ప్లాస్టిక్ మనీ జోరు..!

ముంబై: దేశంలో ప్లాస్టిక్ మనీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వినియోగం భారీగా పెరుగుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో ఇప్పటికే దాదాపు 36.9 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు  సర్క్యులేషన్‌లో ఉన్నాయి. వీటిలో 35 కోట్ల కార్డులు డెబిట్ కార్డులు. 1.9 కోట్ల కార్డులు క్రెడిట్ కార్డులు. 10-15 శాతం కార్డులు కేవలం ఆన్‌లైన్ లావాదేవీల కోసమే వినియోగిస్తున్నారు. చిన్న పట్టణాల్లో సైతం ఈ తరహా లావాదేవీలు పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. ‘పేమెంట్ సిస్టమ్ అప్లికేషన్స్-ఎనేబిలింగ్ పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ)’ పేరుతో ఈ నివేదికను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ నివేదికలో రెండు ప్రధాన పేమెంట్ నెట్‌వర్క్‌లు- మాస్టర్ కార్డ్, వీసాలను ఉటంకించింది.

నివేదికలో ముఖ్యాంశాలు...

 భారత్ ఈ-పేమెంట్స్ విధానంలో ‘కార్డ్ పేమెంట్లు’ అంతర్గత భాగంగా మారాయి. డబ్బు బదలాయింపు, షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి పలు అవసరాలకు కస్టమర్ల ‘కార్డ్’ల వినియోగం పెరుగుతోంది.

  క్రెడిట్ కార్డును ఆచితూచి చేసే ఖర్చులకు వినియోగిస్తున్నారు. 1998లో దేశంలోకి ప్రవేశిం చిన డెబిట్ కార్డులను రోజూవారీ మామూలు ఖర్చులకు వాడుతున్నారు.

  క్రెడిట్ కార్డుల్లో దాదాపు 30 శాతం ఆన్‌లైన్ వినియోగంలో ఉన్నాయి.

 మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్ ద్వారా లభ్యమవుతున్న సమాచారం ప్రకారం కార్డ్ పేమెంట్లలో 75 శాతం కేవలం 20 పట్టణాల్లో కేంద్రీకృతమయ్యాయి. వీటిలో 43 శాతం వాటా ఢిల్లీ, ముంబై, వాటి సబర్బన్ ప్రాంతాలదే.

వీసా అధ్యయనం ప్రకారం- రూ.75,000  నుంచి రూ.1,00,000 శ్రేణిలో నెలవారీ ఆదాయం ఉన్న వారు ఎక్కువమంది ఎలక్ట్రానిక్ కార్డును వినియోగిస్తున్నారు.

 ఎలక్ట్రానిక్ పేమెంట్లు ఎక్కువగా జరుగుతున్న వ్యయ విభాగాల్లో రైల్-ఎయిర్‌ఫేర్ (71 శాతం), మన్నికైన వస్తువులు (61 శాతం), అద్దెలు (49 శాతం), టెలిఫోన్-మొబైల్ (47 శాతం), మెడికల్ ఇన్‌స్టిట్యూట్ (46 శాతం), దుస్తులు-పాదరక్షలు (44 శాతం), శీతల పానియాలు-రిఫ్రష్‌మెంట్స్ (35 శాతం) ఉన్నాయి.

 డెబిట్ కార్డులకన్నా దశాబ్దం ముందు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ, వాటితో పోల్చితే క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధిరేటు నెమ్మదిగా ఉంది. ఆభరణాలు, విందు, షాపింగ్ వంటి వ్యయాలకు క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు