ఎన్‌ఎస్‌ఈలో డొల్ల కంపెనీలెన్ని?

10 Aug, 2017 11:48 IST|Sakshi
ఎన్‌ఎస్‌ఈలో డొల్ల కంపెనీలెన్ని?
మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ డొల్ల కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. 331 అనుమానిత షెల్‌ కంపెనీలను గుర్తించి, ఆ కంపెనీ ట్రేడింగ్‌కు దూరం చేసేసింది. వీటిలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)కు చెందినవి 48 సంస్థలని తేలింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆయా లిస్టెడ్‌ కంపెనీల వివరాలు అందజేయడంతో... వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, మెట్రోపాలిటన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లను సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కంపెనీల సమాచారాన్ని ఎన్‌ఎస్‌ఈ సేకరిస్తోంది. 48 కంపెనీల్లో ఇప్పటికే  10 సంస్థలు రద్దు అయినట్టు తెలిసింది. సెబీ ఆదేశాల కంటే ముందస్తుగానే వీటిని రద్దు చేసినట్టు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. 
 
'' 331 షెల్‌ కంపెనీల్లో ఎన్‌ఎస్‌ఈలో కేవలం 48 కంపెనీలే లిస్టు అయి ఉన్నాయి. వీటిలో కూడా 10 కంపెనీలు సెబీ ఆదేశాల కంటే మందే రద్దు అయ్యాయి'' అని ఎన్‌ఎస్‌ఈ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ 48 కంపెనీల డాక్యుమెంట్లను ఎక్స్చేంజ్‌ నుంచి రెగ్యులేటరీ కోరుతోంది. అంతేకాక ఈ కంపెనీల ఆధారాలను పరిశీలించాలని ఎన్‌ఎస్‌ఈని రెగ్యులేటరీ ఆదేశించింది. సెబీ ఆదేశానుసారం ఎన్‌ఎస్‌ఈ ఈ ప్రక్రియను ప్రారంభించిందని ఎన్‌ఎస్‌ఈ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రక్రియను పూర్తిచేసిన అనంతరం రెగ్యులేటరీకి రిపోర్టు చేస్తామని తెలిపింది. ఈ కంపెనీలను నాల్గవ గ్రేడ్‌ నిఘా నియంత్రణలోకి తీసుకురావడంతో, నెలలో ఒక్కసారి మాత్రమే వీటికి ట్రేడింగ్‌కు వీలుంటుంది. నెలలో ఒక్కసారే అది కూడా మొదటి సోమవారమే వీటిలో ట్రేడింగ్‌కు అనుమతించనున్నట్టు సెబీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ అనుమానిత షెల్‌ కంపెనీలపై ప్రభుత్వం, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసు స్కానర్‌, ఐటీలు సీరియస్‌గా వ్యవహరించనున్నాయి. 
 
మరిన్ని వార్తలు