ఎంబీఏ చదువులు ఘోరం!

28 Apr, 2016 07:18 IST|Sakshi
ఎంబీఏ చదువులు ఘోరం!

ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవు
వచ్చినా జీతం రూ.10వేలకన్నా తక్కువే
ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల స్థితీ తీసికట్టే
ఇంజినీర్లయితే 20-30 శాతం నిరుద్యోగులే
టీచర్ల వృత్తిలోకి సరైన వాళ్లు రావటంలేదు
విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి: అసోచామ్

న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత స్థాయి చదువులైన ఎంబీఏ, ఇంజినీరింగ్‌కు సంబంధించి కళ్లు తిరిగే వాస్తవాల్ని అసోచామ్ బయటపెట్టింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో అతికొద్ది మందికి తప్ప మిగతావారికి ఉద్యోగాలే దొరకటం లేదని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 20-30 శాతం మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని స్పష్టంచేసింది. దీనికి కారణాలను విశ్లేషిస్తూ... మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సి ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు అసోచామ్ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రతిష్టాత్మక ఐఐఎం వంటి  కొన్ని అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే... చాలా బిజినెస్ స్కూళ్లలో చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఈ స్కూళ్ల నుంచి వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకటమే లేదు. చచ్చీచెడీ ఉద్యోగాలు సంపాదించినా వారి జీతాలు మాత్రం రూ.10వేల కంటే తక్కువే ఉంటున్నాయి’’ అని నివేదికలో అసోచామ్ అభిప్రాయపడింది. చదువుల్లో నాణ్యత లేకపోవటం, నాసిరకం మౌలిక సదుపాయాలు, తక్కువ జీతాలకే ప్రాంగణ నియామకాలు జరపడం వంటివి దీనికి కారణాలని పేర్కొంది. నిజానికి దేశంలో దాదాపు 5,500 బిజినెస్ స్కూళ్లున్నాయి. ఇక గుర్తింపు లేనివి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. వీటి చదువుల్లో నాణ్యత మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని ఈ నివేదికలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికలో వెల్లడించిన ముఖ్యాంశాలివీ...
దేశంలో ప్రధాన 20 బిజినెస్ స్కూల్స్‌ను మినహాయిస్తే మిగతా వాటినుంచి ఉత్తీర్ణత సాధిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో 7 శాతం మందికే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి.

 మరో విషయమేంటంటే ఈ గ్రాడ్యుయేట్లలో ఆ 7 శాతం మాత్రమే ఉద్యోగానికి నిజంగా పనికొస్తున్నారు.

 గడిచిన రెండేళ్లలో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో దాదాపు 200 బిజినెస్ స్కూళ్లను మూసేశారు. ఈ ఏడాది మరో 120 స్కూళ్లు మూసేసే అవకాశముంది.

 ఇవన్నీ మూతపడటానికి కారణం నాసిరకం చదువులు, ఆర్థిక మందగమనమే. 2014-16 మధ్య క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ఏకంగా 45 శాతం పడిపోయాయి కూడా.

 గడిచిన ఐదేళ్ల కాలంలో బి-స్కూళ్లలో సీట్లు మూడింతలయ్యాయి. 2015-16 లో ఎంబీఏ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య 5.20 లక్షలుగా ఉంది. 2011-12 ఈ సంఖ్య 3.2 లక్షలు.

 రెండేళ్ల ఎంబీఏ కోసం సగటున ప్రతి విద్యార్థీ రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వారి జీతం రూ.8-10వేలు మాత్రమే ఉంటోంది.

 స్కూలు స్థాయిలో నాణ్యమైన విద్య అందకపోవటంతో ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్ల స్థాయి కూడా పడిపోతోంది. పదిహేనేళ్ల కిందటి వారితో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ల మేధో స్థాయి చాలా తక్కువగా ఉంది.

 నాణ్యమైన బోధన సిబ్బంది లేకపోవటం కూడా దీనికి కారణమే. ఈ వృత్తి అంత ఆకర్షణీయంగా లేకపోవటంతో ఎక్కువమంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.

 ఇక ఉన్నత విద్య విషయానికొస్తే నాణ్యత మరీ దారుణంగా ఉంది. కార్పొరేట్ ప్రపంచానికి తగ్గట్టుగా ఏమాత్రం లేదు.

 ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 శాతానికి ఎలాంటి ఉద్యోగాలూ దొరకటం లేదు. చాలా మంది వారి సాంకేతిక అర్హతలకన్నా తక్కువవైన చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు.

మరిన్ని వార్తలు