ఐదుగురిలో ఒక్కరికే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ 

21 Feb, 2019 01:17 IST|Sakshi

మ్యాక్స్‌ లైఫ్, కాంటార్‌ ఐఎంఆర్‌బీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలకు సంబంధించి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అత్యంత చౌకైనవే అయినప్పటికీ పాలసీదారుల్లో వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. జీవిత బీమా పాలసీలు తీసుకున్న ప్రతి అయిదుగురిలో ఒక్కరు మాత్రమే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదారులు కావటం గమనార్హం. బీమా సంస్థ మ్యాక్స్‌ లైఫ్, కాంటార్‌ ఐఎంఆర్‌బీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 15 మెట్రోపాలిటన్, ప్రథమ శ్రేణి నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 4,566 మంది పాల్గొన్నారు.

సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది (సుమారు 65%) జీవిత బీమా పాలసీలు తీసుకున్నప్పటికీ.. వారిలో 21% మంది మాత్ర మే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఇక 53% మందికి అసలు టర్మ్‌ ఇన్సూరెన్స్, దాని ప్రయోజనాల గురించే తెలియదు. ఇక టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్న వారిలో కూడా 57% మందికి సమ్‌ అష్యూర్డ్‌ గురించి అవగాహన లేదు. జీవిత బీమా పాలసీదారుల సంఖ్య, అవగాహన స్థాయి, రిస్కులను ఎదుర్కొనేందుకు మానసిక సంసిద్ధత అంశాల ఆధా రంగా ఇండియా ప్రొటెక్షన్‌ కోషంట్‌(ఐపీక్యూ) పేరిట ఈ సర్వే నిర్వహించారు. 

మరిన్ని వార్తలు