‘రియల్‌’ రాబడికి చాన్సుంది..!!

9 Apr, 2018 01:39 IST|Sakshi

ఏపీ, తెలంగాణల్లో పెట్టుబడికి అవకాశాలు

నివాస, ఆఫీసులకు విశాఖ, సీఆర్‌డీఏ; కమర్షియల్‌కు తిరుపతి

ఏపీలో 1,500 చదరపు అడుగుల లోపు ఫ్లాట్లకే ఆదరణ

హైదరాబాద్‌లో ఏడాదిలోనే భారీగా పెరిగిన ధరలు

భాగ్యనగరానికి దీటుగా వరంగల్, కరీంనగర్‌ అభివృద్ధి  

బంగారం ధర కొన్నాళ్లుగా పెద్దగా పెరగటం లేదు. ఒకదశలో ఆగిపోయింది. మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లు మంచి రాబడినిస్తున్నాయి కానీ... రిస్క్‌ ఉంటుంది. ఈ మధ్య మార్కెట్లు బాగా పడటంతో ఈ విషయం అందరికీ తెలిసొచ్చింది. కాకపోతే దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టేవారికి పడటం కూడా మంచి అవకాశమే!. ఇక రియల్‌ ఎస్టేట్‌!. కావాల్సినపుడు తక్షణం సొమ్ము చేసుకోలేకపోవటం... అప్పుడప్పుడు మార్కెట్‌ డల్‌గా ఉండటం వంటి ప్రతికూలతలు ఉన్నా... దీర్ఘకాలంలో, ఒక్కోసారి స్వల్పకాలంలో మంచి లాభాలు రావాలంటే రియల్టీనే మంచి పెట్టుబడి సాధనం. అందుకే స్థానికుల నుంచి ప్రవాసుల వరకూ అందరి చూపూ రియల్టీపైనే ఉంటోంది.

అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రియల్టీ పెట్టుబడికి ఎక్కడ అవకాశాలున్నాయన్నది చూస్తే... ఏపీలో ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ–గుంటూరు, తిరుపతి కనిపిస్తున్నాయి. స్థానిక వనరులు, అభివృద్ధి కారణంగా కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలూ కొంత బెటరే. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ బోలెడన్ని అవకాశాలున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అభివృద్ధికి, పరిశ్రమల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడంతో జిల్లా కేంద్రాలూ ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... –హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో


ఆకర్షణతో అభివృద్ధి అవకాశాలు..
విజయవాడ–గుంటూరు మధ్యనున్న మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలను కలిపి అమరావతి పేరిట కొత్త రాజధానిగా ప్రకటించటంతో దాదాపు రెండు నగరాలూ కలిసిపోయాయి. తాడేపల్లి నుంచి మంగళగిరి, కాజ, తెనాలి, చినకాకాని, పెదకాకాని వరకు స్థిరాస్తి రంగం సరళ రేఖలా విస్తరించింది.

ఏపీలోని 3 ప్రధాన నగరాల్లో ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. బెంగళూరుకు దగ్గరగా ఉన్న అనంతపురంలో ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లను ప్రతిపాదించారు. గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, విజయవాడలో రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణం వంటివి ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే స్థిరాస్తి రంగం మరింత ఊపందుకుంటుంది.

రియల్‌ భ్రమలు తొలిగాయ్‌..
విశాఖపట్నంలో ముందు నుంచీ రియల్టీ బాగానే ఉంది. స్టీల్‌ ప్లాంట్, పోర్టు, పర్యాటక ప్రాంతం కావటం, మెట్రోపాలిటన్‌ సిటీ సంస్కృతి వంటివి దీనికి కారణమని చెప్పొచ్చు. ‘‘కొత్త రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలతో వైజాగ్‌ హైదరాబాద్‌లా అభివృద్ధి చెందుతుందని ఆశించాం.

కానీ, భ్రమలు తొలగి.. వాస్తవంలోకి చేరుకున్నాం’’ అని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ శివారెడ్డి తెలిపారు. శ్రీసిటీ వల్ల చిత్తూరు జిల్లాలో రియల్‌ వ్యాపారం కాసింత పర్వాలేదని, కానీ, ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారాయన. రియల్‌ ప్రాజెక్ట్‌లకు ప్రధాన వనరు ఉద్యోగ అవకాశాలేనన్నారు.

తిరుపతిలో కమర్షియల్‌ హవా..
తిరుపతిలో నివాస సముదాయాల కంటే వాణిజ్య ప్రాపర్టీలదే హవా. ఎందుకంటే తిరుపతి పర్యాటక ప్రాంతం కాదు. పుణ్యక్షేత్రం. రెండింటికీ చాలా తేడా ఉంది. పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చిన భక్తులు దర్శనం అయ్యే వరకు హోటల్లోనో, దేవస్థాన గదుల్లోనో ఉంటారు. దర్శనం పూర్తి కాగానే ఇంటికెళ్లిపోతారు. అంతేతప్ప అక్కడుండరు.

అందుకే అక్కడ నివాస సముదాయాల బదులు వాణిజ్య సముదాయాలకు గిరాకీ ఎక్కువ.  అందుకే స్థానిక డెవలపర్లు హోటళ్లు, రెస్టారెంట్లు, కమర్షియల్‌ ప్రాపర్టీల నిర్మాణానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో లక్ష చ.అ. వరకు కమర్షియల్‌ స్థలం నిర్మాణంలో ఉంది. కమర్షియల్‌ స్థలంలో ధరలు చ.అ.కు రూ.4–5 వేలుగా ఉన్నాయి. అద్దెలు నెలకు చదరపు అడుగుకి రూ.25–30 వరకున్నాయి.

నిర్మాణంలో 75 వేల ఫ్లాట్లు
ప్రస్తుతం ఏపీలో సుమారు 75 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 80 శాతం వైజాగ్, విజయవాడ–గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లోనివే. ఇందులోనూ 1,000–1,500 చ.అ. ఫ్లాట్లే 90 శాతం వరకుంటాయని శివారెడ్డి తెలిపారు. ఏపీలో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు, లగ్జరీ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు, కొనుగోళ్లు రెండూ తక్కువే.

ఎందుకంటే ప్రీమియం ఫ్లాట్ల విస్తీర్ణం ఎంతలేదన్నా 3,000 చ.అ.లకు పైనుండాలి. దీని ధర సుమారు రూ.2 కోట్ల వరకుంటుంది. రిజిస్ట్రేషన్, జీఎస్‌టీ కోసం రూ.40 లక్షలు చెల్లించాలంటే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతారు. అందుకే కొనుగోళ్లు ఉండవ్‌.. నిర్మాణాలూ ఉండవ్‌! హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రభుత్వ ఉద్యోగులొచ్చాక అద్దె ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా విజయవాడ– గుంటూరు ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అద్దెలు పెరిగాయి. అప్పటి వరకూ రూ.6 వేలున్న 2 బీహెచ్‌కే ఫ్లాట్‌ ఒక్కసారిగా రూ.10 వేలకు చేరింది.

అప్పుడు ముంబై.. ఇప్పుడు హైదరాబాద్‌!
1950లో గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర విడిపోయింది. దీంతో ముంబై అభివృద్ధి ఆగిపోతుందని, మహారాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్ధకమవుతుందని భయపడ్డారు. కానీ దేశ ఆర్థిక రాజధాని స్థాయికి ఎదిగింది ముంబై!!. ఇపుడు హైదరాబాద్‌దీ అలాంటి పరిస్థితే. వచ్చే ఐదేళ్లలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే శరవేగంగా అభివృద్ధి చెందడం ఖాయమన్నది క్రెడాయ్‌ తెలంగాణ చాప్టర్‌ ప్రధాన కార్యదర్శి రామచంద్రా రెడ్డి అభిప్రాయం.

కాస్మోపాలిటన్‌ సంస్కృతి, మెరుగైన మౌలిక వసతులు, అనుకూల వాతావరణం, అందుబాటు ధరలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, ఐటీ, ఫార్మా రంగాలు, విమానాశ్రయం, మెట్రో రైల్, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, లా అండ్‌ ఆర్డర్‌ వంటివి హైదరాబాద్‌ అభివృద్ధికి రహదారులుగా మారతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

నగరంలో సమాంతర అభివృద్ధి..
హైదరాబాద్‌లో గడిచిన ఏడాదిలోనే ధరలు భారీగా పెరిగాయి. అయితే గతంలో దక్షిణం వైపున మాత్రమే ప్రాజెక్ట్‌లు చేసిన నిర్మాణ సంస్థలు... మెట్రో, ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో హైదరాబాద్‌లో అన్ని వైపులా నిర్మాణాలు చేపడుతున్నాయి. తూర్పు, ఉత్తర దిక్కుల్లోనూ బడా నివాస, వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నాయి. ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో ధరలు అందుబాటులో ఉండటంతో ప్రవాసులు, హెచ్‌ఎన్‌ఐలు, వ్యాపారస్తులు, సామాన్యులు పెట్టుబడులకు దీన్ని ఎంచుకుంటున్నారు.

అయితే తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత... హైదరాబాద్‌కు దీటుగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలూ అభివృద్ధి చెందుతున్నాయి. ట్రైసిటీస్‌గా పిలిచే వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లో... వరంగల్‌ను కేంద్రం స్మార్ట్‌ సిటీల జాబితాలో చేర్చింది. అక్కడ ప్రభుత్వం టెక్స్‌టైల్స్‌ హబ్, ఐటీ పార్క్, ఇంక్యుబేషన్‌ సెంటర్లను ప్రారంభించటంతో పలు కంపెనీలు కొలువుదీరాయి. పైగా హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో జాతీయ రహదారి వెంబడి స్థిరాస్తికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

పాత జిల్లా కేంద్రాలే బెటర్‌..
జిల్లాల విభజన జరిగినపుడు పాత జిల్లాల్లో రియల్‌ అభివృద్ధి మందగించింది. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడటంతో వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు కొత్త జిల్లా కేంద్రాల వైపు పరుగులు తీశారు. అక్కడ స్థిరాస్తి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కానీ కొత్త జిల్లాల్లో ఆశించిన స్థాయిలో మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు లేవు. పైగా పాత, కొత్త జిల్లాల మధ్య పరిధి తక్కువ కనక వలసలూ తగ్గాయి. దీంతో వ్యాపారం మందగించి.. అభివృద్ధి మళ్లీ పాత జిల్లా కేంద్రాలవైపు మళ్లింది.

ఇప్పటికే ప్రభుత్వం వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల మాస్టర్‌ ప్లాన్లపై దృష్టి పెట్టింది. దీంతో హైదరాబాద్‌కు పోటీగా జిల్లాలు అభివృద్ధి చెందే అవకాశముంది. ప్రవాసులు కూడా హైదరాబాద్‌లో కంటే సమాంతరంగా అభివృద్ధి చెందుతున్న వాళ్ల సొంత జిల్లా కేంద్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఎక్కువ రేటుకు ప్రాపర్టీలను విక్రయించి... నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండటం దీనికి నిదర్శనం.

మరిన్ని వార్తలు