ఒరాకిల్ కు భారీ షాక్

2 Jul, 2016 08:42 IST|Sakshi
ఒరాకిల్ కు భారీ షాక్

శాన్ ఫ్రాన్సిస్కో : ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ ఒరాకిల్ కార్పొరేషన్ కు కాలిఫోర్నియా జ్యూరీ నుంచి భారీ షాక్ ఎదురైంది. హెచ్ పీ ఇటానియం సర్వర్ కేసులో హెచ్ పీ ఎంటర్ ప్రైజెస్ కు 20 వేల కోట్లకు పైగా (300 కోట్ల డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని ఒరాకిల్ ను జ్యూరీ ఆదేశించింది. 2012లోనే ఈ కేసుపై మొదటి దశ ట్రయల్ నడిచింది. హెచ్ పీ ఇటానియం ఆధారిత సర్వర్లతో ఒరాకిల్ సాప్ట్ వేర్ డెవలప్ చేసే ఒప్పందాన్ని ఉల్లఘించడంతో ఈ కేసు ప్రారంభమైంది. కాంట్రాక్ట్ ఉల్లంఘన కేసును ఒరాకిల్ పై హెచ్ పీ నమోదుచేసింది. ఇటానియం ప్రాసెసర్ ను ఇంటెల్ ఇంక్ తయారుచేసింది. ఈ చిప్ కు కాలం చెల్లిపోవడంతో, 2011లో ఒరాకిల్ సాప్ట్ వేర్ డెవలప్ చేయడం ఆపివేసింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఆ చిప్ వాడుకలో ఉన్నా లేకపోయినా ఒరాకిల్ హెచ్ పీకి సపోర్టు చేయడం కొనసాగించాలని హెచ్ పీ వాదించింది.

ఈ చిప్ కు కాలం చెల్లడంతోనే ఎక్స్ 86 మైక్రో ప్రాసెసర్లపై దృష్టిసారించామని ఇంటెల్ సైతం స్పష్టంచేసింది. అయినా హెచ్ పీ ఈ కేసుపై కోర్టు గడపతొక్కింది. హెచ్ పీకి నష్టం జరిగిందని భావించిన శాంట క్లారా సుపీరియర్ కోర్టు జడ్జి జేమ్స్ క్లెయిమ్ బర్గ్ ఒరాకిల్ నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించారు. జ్యూరీ తీర్పుతో హెచ్ పీ తృప్తిపొందిందని, తగిన ఆధారాలు చూపించడంతో ఈ కేసును తప్పక అధిగమిస్తామని తమకు ముందు నుంచే తెలుసని హెచ్ పీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిండెంట్ జాన్  ఘల్ట్ చెప్పారు. ఒరాకిల్ సాప్ట్ వేర్ ను డెవలప్ చేయడం ఆపివేయడం కాంట్రాక్టును ఉల్లఘించడమేనని స్పష్టంచేశారు. అయితే ఈ తీర్పుపై తాము అప్పీల్ కు వెళ్తామని ఒరాకిల్ జనరల్ కౌన్సిల్ డోరైన్ డాలే పేర్కొన్నారు

మరిన్ని వార్తలు