ఆధార్‌ హ్యాకింగ్‌పై స్పందించిన నందన్‌ నీలేకని

11 Jan, 2018 10:03 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  ఆధార్‌  డేటా హ్యాకింగ్‌పై  యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) మాజీ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని ఎట్టకేలకు  స్పందించారు.  ఆధార్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకే ఆధార్‌పై  కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆధార్‌ను దుర్వినియోగపరిచేందుకు "కల్పిత ప్రచారం"  చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్‌  సైన్స్‌ ఫౌండేషన్‌  అవార్డ్‌ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రిబ్యూన్ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావిస్తూ ఆధార్‌పై నిర్మాణాత్మక దృష్టిలేకుండా.. ప్రతికూల అభిప్రాయాలతో ఉంటే.. చర్యలు కూడా ప్రతికూలంగానే ఉంటాయన్నారు.  అందువల్ల ప్రజలు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని కలిగి ఉండటం మంచిదని పేర్కొన్నారు.

మరోవైపు  యుఐడిఎఐ తాజా విధానాన్ని నందన్‌ నీలేకని   స్వాగతించారు.   ఈ వ్యవహారంలో ఆధార్‌ సంస్థ ​ కీలక  ప్రకటన  చేసిందని ప్రశంసించారు.  ఇక ప్రతివారు తమ​ వర్చువల్‌ ఐడీ  క్రియేట్‌ చేసుకోవచ్చని, ఇది చాలా ముఖ్యమైన ఫీచర్లను అందిస్తోందని చెప్పారు. దీంతో  ఆధార్‌ నెంబర్‌ను వెల్లడి చేయాల్సిన అవసరం  లేదని పేర్కొన్నారు.  అలాగే ఇతర ఏజెన్సీలు ఆధార్‌ నెంబర్లను సేకరించే ఛాన్స్ ఉండదని  తెలిపారు. అటు సుప్రీకోర్టు ఆధార్‌ను గుర్తిస్తుందనే నమ్మకం తనకుందనే విశ్వాసాన్ని  వ్యక్తం చేశారు.

కాగా ఆధార్‌ వివరాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడీఏఐ చర్యలు చేపట్టింది.  వర్చువల్‌ ఐడీ, పరిమిత కేవైసీ కోడ్‌ అనే రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక వ‌ర్చువ‌ల్ ఐడీని జారీ చేసే విధానాన్ని ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది. మార్చి ఒకటి నుంచి ఇది పూర్తిస్థాయి అమల్లోకి రానుంది.

మరిన్ని వార్తలు