నిద్రపుచ్చే కంపెనీ! 

2 Mar, 2019 00:58 IST|Sakshi

వేక్‌ఫిట్‌లో ఆర్థోపెడిక్‌  స్లీపింగ్‌ ఉత్పత్తులు 

త్వరలో మార్కెట్లోకి ట్రావెల్‌ పిల్లోస్, దుప్పట్లు, కుషన్స్‌ 

నెలకు రూ.9 కోట్ల వ్యాపారం; హైదరాబాద్‌ వాటా కోటి 

రూ.65 కోట్లు నిధుల సమీకరణ  

‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ చైతన్య రామలింగె గౌడ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘నిద్ర పోవాలంటే.. ముందు మేల్కోవాలి’ ఇది ఓ పరుపుల తయారీ కంపెనీ ప్రకటన. మేల్కోవాల్సిన అవసరం లేదు.. నిద్రపుచ్చితే చాలు అంటోంది మ్యాట్రెస్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ వేక్‌ఫిట్‌. వేక్‌ఫిట్‌ పరుపు మీద 6 గంటలు నిద్రపోతే చాలు! 8 గంటల గాఢ నిద్రతో సమానమంటోంది. కస్టమర్ల వయస్సు, లింగ భేదం, శరీరాకృతి, తత్వాలను బట్టి ఆర్థోపెడిక్‌ పరుపులను అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కంపెనీ కో–ఫౌండర్‌ చైతన్య రామలింగె గౌడ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.   ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే ఏ మ్యాట్రెస్‌లనైనా తీసుకోండి.. తయారీ సంస్థ నుంచి కస్టమర్‌కు మధ్యలో డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, రిటైలర్‌ మూడు రకాల మధ్యవర్తులుంటారు. ప్రతి దశలో ఎవరి మార్జిన్స్‌ వారికుంటాయి. దీంతో ఉత్పత్తి అంతిమ ధర పెరుగుతుంది. కానీ, వేక్‌ఫిట్‌లో తయారీ కేంద్రం నుంచి నేరుగా కస్టమర్‌కు చేరుతాయి. దీంతో నాణ్యమైన ఉత్పత్తులతో పాటూ ధర తగ్గుతుంది. ఇదే లక్ష్యంగా 2016 మార్చిలో బెంగళూరు కేంద్రంగా రూ.15 లక్షల పెట్టుబడితో మరొక కో–ఫౌండర్‌ అంకిత్‌ జార్జ్‌తో కలిసి వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్‌ను ప్రారంభించాం. 

వారం రోజుల్లో మరో 4 ఉత్పత్తులు.. 
ప్రస్తుతం వేక్‌ఫిట్‌లో పరుపులు, దిండ్లు, పరుపుల కవచాలు, బెడ్స్‌ ఉన్నాయి. వీటి ధరలు పరుపులు రూ.5 వేలు, దిండ్లు రూ.399, కవచాలు రూ.999, బెడ్‌ రూ.10 వేల నుంచి ఉన్నాయి. వచ్చే వారం  ట్రావెల్‌ దిండ్లు, దుప్పట్లు, కుర్చీ కుషన్స్, బ్లాంకెట్‌ ఉత్పత్తులను విడుదల చేయనున్నాం. ప్రస్తుతం నెలకు 9 వేల పరుపులను విక్రయిస్తున్నాం. వీటికి 20 ఏళ్ల వారంటీ ఉంటుంది. అన్ని ఉత్పత్తులు కలిపి నెలకు రూ.9 కోట్ల వరకు విక్రయిస్తున్నాం.  

హైదరాబాద్‌ నుంచి రూ.కోటి...
మా వ్యాపారంలో బెంగళూరు, ముంబై తర్వాత హైదరాబాద్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడ నెలకు 800 పరుపులను విక్రయిస్తున్నాం. కోటికి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తు న్నాం. గచ్చిబౌలి సమీపంలో ఒక గిడ్డం గి ఉంది. త్వరలోనే దీని సామర్థాన్ని విస్తరించనున్నాం. ఇటీవలే బెంగళూరులో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించాం. త్వరలోనే హైదరాబాద్, ముంబై నగరాల్లో ఏర్పాటు చేయనున్నాం.  

ఉత్తరాదిలో 2 కొత్త గిడ్డంగులు.. 
ఇప్పటివరకు 3 లక్షల మంది మా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఏడాదిలో 5 లక్షలకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. మా మొత్తం కస్టమర్లలో 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఉంటారు. ఆర్డర్‌ వచ్చిన 4–5 రోజుల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తాం. ముడి సరుకులను యూరప్, మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం బెంగళూరులో తయారీ కేంద్రం ఉంది. దీని సామర్థ్యం రోజుకు 500 పరుపులు. హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరులో గిడ్డంగులున్నాయి. ఏడాదిలో ఉత్తరాది రాష్ట్రాల్లో 2 గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం. 

2020 నాటికి రూ.200 కోట్లు.. 
2017–18లో రూ.27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఇప్పుడు మార్చి ఫలితాల నాటికి రూ.80 కోట్లను అధిగమిస్తాం. 2020 నాటికి రూ.200 కోట్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం సంస్థలో 160 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 200లకు చేర్చుతాం. ఇటీవలే సికోయా క్యాపిటల్‌ 31.9% వాటాతో రూ.65 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో 10–15% నిధులను ప్లాంట్‌ విస్తరణకు వినియోగిస్తామని’’ చైతన్య వివరించారు. 

>
మరిన్ని వార్తలు