ఊగిసలాట..

15 Jul, 2015 00:42 IST|Sakshi
ఊగిసలాట..

♦ 28 పాయింట్ల నష్టంతో 27,933కు చేరిక
♦ 6 పాయింట్ల నష్టంతో 8,454కు నిఫ్టీ
 
 వినియోగదారుల ద్రవ్యోల్బణం(జూన్ నెల) పెరగడంతో కీలక రేట్ల కోత ఆశలు సన్నగిల్లి, వడ్డీరేట్ల ప్రభావిత షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 27,933 పాయింట్ల వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 8,454 పాయింట్ల వద్ద ముగిశాయి.  వాహన, రియల్టీ, బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. అయితే వరుసగా ఎనిమిదో నెల కూడా టోకుధరల ద్రవ్యోల్బణం మైనస్‌లోనే నమోదు కావడం స్టాక్ మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చింది.

 ఆయిల్, ఫార్మా షేర్ల జోరు...  ఇరాన్‌పై ్రఆంక్షలు తొలగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో  ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో  హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీల షేర్లు 3 శాతం వరకూ పెరిగాయి.  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అలెంబిక్ ఫార్మా, ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీల షేర్లు కొత్త రికార్డ్ స్థాయిలను తాకాయి. ఇతర ఫార్మా షేర్లు ఎల్డర్ ఫార్మా, టీటీకే హెల్త్‌కేర్, సువెన్ లైఫ్ సెన్సైస్, వివిమెడ్ ల్యాబ్స్, అర్తి డ్రగ్స్, మార్క్‌సన్స్ ఫార్మా, క్లారిస్ లైఫ్ సెన్సైస్ 2-8 శాతం రేంజ్‌లో పెరిగాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,907 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.14,948 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,83,942 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.270 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.131 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.

మరిన్ని వార్తలు