2లక్షల కంపెనీలపై వేటు

6 Sep, 2017 01:47 IST|Sakshi
2లక్షల కంపెనీలపై వేటు

ఆర్‌వోసీ నుంచి తొలగింపు
► బ్యాంక్‌ ఖాతాల స్తంభన కేంద్రం ఆదేశాలు
►  రెగ్యులేటరీ నిబంధనలను పాటించని నేపథ్యం
► మరికొన్ని కంపెనీలపైనా చర్యలకు సమాయత్తం
► నల్లధనంపై మరో కీలక నిర్ణయం  


న్యూఢిల్లీ: నల్లధనం నిరోధించే దిశలో కేంద్రంలోని మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించని 2.09 లక్షల కంపెనీలను రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌వోసీ) నుంచి తొలగించింది. ఇందులో భాగంగా ఆయా బ్యాంక్‌ ఖాతాల స్తంభనకూ ఆదేశాలు ఇచ్చింది. ఆయా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. మరికొన్ని కంపెనీలపైనా ఇదే విధమైన చర్యలకు అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిబంధనలు పాటించకుండా, చాలాకాలం నుంచి వ్యాపారం చేయకుండా ఉంటున్న కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని బ్యాంకులను ఆదేశించినట్లు ఆర్థికశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా ఆయన తెలిపిన అంశాలు క్లుప్తంగా...

తప్పు చేసిన కంపెనీలను వదిలిపెట్టడం జరగదు. కార్పొరేట్‌ ప్రమాణాల మెరుగుదలకు ఈ చర్యలు దోహదపడతాయి. వ్యవస్థ ప్రక్షాళన దిశలో ఇదొక ముందడుగు.  
♦  కంపెనీల చట్టంలోని 248 (5) సెక్షన్‌ ప్రకారం మొత్తం 2,09,032 కంపెనీలను రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి తొలగించడం జరిగింది. ఈ చర్యతో ఆయా కంపెనీల ప్రస్తుత డైరెక్టర్లు, ఆథరైజ్డ్‌ సిగ్నేటరీస్‌ తమ హోదాలను కోల్పోయి, మాజీలుగా మారతారు.   
♦  డీమోనిటైజేషన్‌ సమయంలో నల్లడబ్బును వ్యవస్థలోకి తీసుకురావడానికి ఈ కంపెనీలు (తాజా డీరిజిస్టర్డ్‌) తమ అకౌంట్లను వినియోగించుకున్నాయా? ఆయా అంశాలకు సంబంధించి ఈ కంపెనీల కార్యకలాపాలు ఏమన్నా ఉన్నాయా? అన్న అంశంపై సైతం సమగ్ర విశ్లేషణ ప్రారంభమైంది.  
♦   ఆర్‌ఓసీ నుంచి తొలగించిన కంపెనీల బ్యాంక్‌ అకౌంట్లపై ఆంక్షల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఇప్పటికే ఆర్థిక సేవల శాఖ నుంచి ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ ద్వారా వర్తమానం అందింది.  
♦  నిజానికి ప్రస్తుత చర్యలను ఎదుర్కొంటున్న కంపెనీల్లో కొన్ని కార్పొరేట్‌ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌కు సంబంధించి క్రియాశీలంగానే ఉన్నాయి. అయితే తగిన సమయంలో తమ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లు లేదా వార్షిక రిటర్న్స్‌ తదితర ఇతర రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి.  
♦  ఏదైనా కంపెనీ అకౌంట్‌ స్తంభించిపోతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు తిరిగి బ్యాంక్‌ను సంప్రదించి, తగిన కారణాలు చూపి అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించుకునే వీలూ ఉంది.

నల్లధనమే లక్ష్యం...
నల్లధనాన్ని నిర్మూలించాలన్నది ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తన సర్వశక్తులనూ ఒడ్డుతుంది. ఇందుకు అనుగుణంగా నల్లధనం తదుపరి యుద్ధంలో భాగంగానే బ్యాంకులకు తాజా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణం ఈ చర్యలు అమల్లోకి వస్తాయి. – ట్వీటర్‌లో పీపీ చౌదరి, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి 

మరిన్ని వార్తలు