ఐపీఓకు ఇది సరైన సమయం కాదు

6 Sep, 2018 01:49 IST|Sakshi

ఓవీఎల్‌ లిస్టింగ్‌ ఇప్పడే కాదు    ఇంకా సమయం ఉందంటున్న ఓవీఎల్‌ మేనేజ్‌మెంట్‌  

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌(ఓవీఎల్‌)ను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయడానికి ఇది సరైన సమయం కాదని ఓవీఎల్‌ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. మొజాంబిక్, ఇరాన్‌ల్లోని భారీ చమురు క్షేత్రాల్లో 2022 నుంచి ఉత్పత్తి చేయడం ఆరంభిస్తామని, అప్పుడైతే, మంచి విలువ వస్తుందని, స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌కు అదే సరైన సమయమని ఆయన వివరించారు.  ఈ విషయాన్ని ఇంకా ప్రభుత్వానికి నివేదించలేదని, థర్డ్‌ పార్టీ ఎనాలసిస్‌ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అన్ని విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.  

ఓవీఎల్‌ను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలని గత నెలలో ప్రభుత్వం ఓఎన్‌జీసీకి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. ఓవీఎల్‌ను లిస్ట్‌ చేయడం ద్వారా వచ్చిన నిధులను స్పెషల్‌ డివిడెండ్‌గా ప్రభుత్వానికి చెల్లించాలని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం నెరవేరుతుందని ఆ లేఖలో ప్రభుత్వం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌పీసీఎల్‌లో 51.11 శాతం వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని ప్రభుత్వం సునాయాసంగా సాధించగలిగింది. ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం ద్వారా ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం యోచించింది. కానీ ఈ వాటా విక్రయం విఫలం కావడంతో మళ్లీ ఓఎన్‌జీసీ వైపు ప్రభుత్వం చూస్తోంది. 

>
మరిన్ని వార్తలు