సొంత పాలసీ ఉంటేనే జేబుకూ ఆరోగ్యం

14 Jul, 2013 04:54 IST|Sakshi
pocket health

రాను రాను వైద్య చికిత్స వ్యయం మరీ పెరిగిపోతోంది. మిగతా ఖర్చులన్నిటినీ వెనక్కి నెట్టేసి ఇదే ముందుకొచ్చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలనే అప్పులపాలు చేసేస్తోంది. వీటికి విరుగుడు బీమా ఒక్కటే. కాకపోతే చాలామంది ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న కంపెనీ తమకు ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అనే ఉద్దేశంతో సొంతగా బీమా తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. దాని అవసరం ఏముంటుందిలే అనుకుంటున్నారు. మరి ఈ తీరు సరైనదేనా? నిపుణులేమంటున్నారు? కంపెనీ కల్పించే బీమా సరిపోతుందా? సొంత బీమా ఉండాలా? ఇదే ఈ వారం ‘ప్రాఫిట్’ ముఖ్య కథనం...
 
 రాకేష్ వయస్సు 35 ఏళ్లు. పనిచేసేది ఓ మల్టీనేషనల్ కంపెనీలో. జీతం రూ.40,000. సొంతిల్లు, కారుతో పాటు అన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్ పథకాలూ ఉన్నాయి. తాను పనిచేసే కంపెనీలో రూ.5 లక్షల వరకు వైద్య బీమా సదుపాయం ఉండటంతో వ్యక్తిగతంగా ఎలాంటి హెల్త్ పాలసీ తీసుకోలేదు. ఒకరోజు ఆఫీసుకెళ్లగానే మేనేజర్ నుంచి కబురొచ్చింది. అక్కడాయన మాటలు వినేసరికి కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. మాంద్యం వల్ల సిబ్బంది సంఖ్యను సగానికి తగ్గిస్తున్నామంటూ... మర్నాటి నుంచి రావాల్సిన అవసరం లేదన్నారు. రాకేష్‌కేమీ పాలుపోలేదు. వేరే ఉద్యోగానికి చేసిన ప్రయత్నాలు వెంటనే కలిసిరాలేదు. ఈ  మానసిక ఆందోళనలో ఉండగానే ఒక రోజు రాత్రి గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలయ్యాయి. ఆపరేషన్ అవసరమైంది. రాకేష్ దగ్గరున్న ఆరోగ్య బీమా కార్డు ఇచ్చారు. కానీ దాన్ని బీమా కంపెనీ తిరస్కరించింది. రాకేష్‌కు అప్పటికే ఉద్యోగం పోవడంతో ఆ కంపెనీ ఇస్తున్న గ్రూప్ వైద్య బీమా సదుపాయం రద్దయిందని చెప్పారు. చేసేది లేక సన్నిహితులు, బంధువుల సాయంతో 3.5 లక్షల బిల్లు చెల్లించారు. రాకేషే కాదు... చాలా మంది కంపెనీ ఇస్తున్న బీమా ఉంది కదాని సొంతగా వేరే బీమా తీసుకోరు. కానీ వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా ఉంటేనే మేలనేందుకు చాలా కారణాలున్నాయి.
 
 వ్యక్తిగతం ఎందుకంటే...
 కార్పొరేట్ కంపెనీలు లేదా వివిధ యూనియన్లు అందించే గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో అనేక నిబంధనలుంటాయి. ముఖ్యంగా ఆ కంపెనీకి లేదా యూనియన్‌కు ఉద్యోగి రాజీనామా చేసినా లేక యాజమాన్యం తొలగించినా పాలసీ రద్దవుతుంది. అంతేకాదు కంపెనీ మధ్యలో ఎప్పుడైనా ఈ సదుపాయాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకునే అవకాశమూ ఉంది. కంపెనీ తన ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా అందించాలన్న చట్టాలేమీ లేవు. అంటే... ఒక కంపెనీ నుంచి వేరొక కంపెనీకి మారితే అక్కడ ఆరోగ్య బీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. పోనీ అప్పుడు సొంతగా తీసుకుందామనుకుంటే... మొదటి నుంచీ తీసుకున్నవారికైతే ఏడాదికి చెల్లించే మొత్తం తక్కువగా ఉంటుంది. కానీ వయసు పెరిగిన తరవాత తీసుకుంటే ఈ మొత్తం చాలా ఎక్కువ వుతుంది. అంతేకాక పదవీ విరమణ తర్వాత... అంటే 60 ఏళ్ల తర్వాత సొంతగా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువ. అదే మొదట్నుంచీ సొంత పాలసీని కొనసాగిస్తున్నట్లయితే 60 ఏళ్లు దాటినా భారం పెద్దగా ఉండదు. ఇంకొకటి కూడా గమనించాలి. సాధారణంగా బీమా కంపెనీలు 45 ఏళ్ల లోపు వారికి ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే పాలసీలిస్తాయి. ఈ పరిమితి దాటితే వైద్య పరీక్షలు తప్పనిసరి. ఈ పరీక్షల్లో ఏదైనా వ్యాధి రావడానికి 0.01% అవకాశం ఉందని తేలినా సరే ఆ వ్యాధికి బీమా రక్షణ ఇవ్వవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వ్యక్తిగత పాలసీ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.
 
 ఎంత మొత్తానికి ఉండాలి?
 ప్రస్తుతం వైద్యం చాలా ఖరీదైన విషయంగా మారిపోయింది. ఏటా కొత్త కొత్త జబ్బులు వస్తుండటంతో పాటు వైద్య ఖర్చులూ భారీగా పెరిగిపోతున్నాయి. గుండెకు సంబంధించి ఏ చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్నా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బిల్లు అవుతోంది. కొద్దిగా పెద్ద ఆపరేషన్ అయితే మరింత చెల్లించక తప్పదు. అందుకే కనీసం రూ.3 నుంచి 5 లక్షల వరకు వైద్య బీమా ఉండాలన్నది నిపుణుల సూచన. మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చాలా ఆసుపత్రులు బీమాతో చికిత్స చేయించుకున్న వారికి అధిక చార్జీలు వేస్తున్నాయి. నేరుగా నగదు చెల్లిస్తే తగ్గిస్తున్నాయి. అందుకని బీమా కవర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
 
 కుటుంబం మొత్తానికి...
 మీకొక్కరికే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ఉండేలా చూసుకోవాలి. విడివిడిగా కాక కుటుంబం మొత్తానికి ఒకే పాలసీ తీసుకుంటే ప్రీమియం భారం తగ్గుతుంది. వీటినే ఫ్లోటర్ పాలసీలంటారు. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి... 28 ఏళ్ల భార్య, 5 ఏళ్ల బాబు పేర్లమీద ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకున్నాడు. వీరి పేరిట రెండు లక్షలకు ఆరోగ్య బీమా తీసుకుంటే సుమారుగా రూ.7,260 ప్రీమియం చెల్లించాలి. ముగ్గురికి కలిపి అంతే మొత్తానికి పాలసీ తీసుకుంటే రూ.4,654 కడితే చాలు. ఫ్లోటర్ పాలసీ వల్ల రూ.2,606 ప్రీమియం ఆదా అయిందన్న మాట. ఏజెంట్ ద్వారా కాక ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే మరింత ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు.
 
 రెండేళ్లయితే డిస్కౌంట్
 హెల్త్ పాలసీలను ఏటా రెన్యువల్ చేసుకోవాలి. దీనివల్ల పెరిగే వయసుతో పాటు ప్రీమియం భారమూ పెరుగుతుంది. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఐదేళ్లకు, రెండేళ్లకు పాలసీలందించటమే కాక.. వీటి ప్రీమియంలపై 7-8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీని వల్ల ప్రీమియం భారం కొంతయినా తగ్గుతుంది. ఉదాహరణకు అపోలో హెల్త్ పాలసీ రెండేళ్లకు తీసుకుంటే ప్రీమియంపై 7.5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. పైన చెప్పుకున్న ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకుంటే ఏడాదికి రూ.4,654 చొప్పున రెండేళ్లకు రూ.9,308 చెల్లించాలి. ఒకేసారి రెండేళ్లకు తీసుకుంటే ప్రీమియంలో రూ.700 వరకు కలిసొస్తుంది.
 
 కో-పేమెంట్
 విదేశాల్లో వాడుకలో ఉన్న కో-పేమెంట్ విధానం మన దేశంలో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. అంటే... నూరు శాతం బీమా కంపెనీపై ఆధారపడకుండా ఎంతో కొంత పాలసీదారు చెల్లించే విధానమన్న మాట. దీనివల్ల ప్రీమియం భారం తగ్గుతుంది. సాధారణంగా కంపెనీలు గరిష్టంగా 30% వరకూ కో పేమెంట్‌కు అంగీకరిస్తున్నాయి. వయోధికులకు ప్రీమియం చార్జీలు ఎక్కువ కనక వారికిది బాగుంటుంది. ఉదాహరణకు 55 ఏళ్ల వ్యక్తి అయిదురోజుల చికిత్స చేయించుకుంటే బిల్లు రూ.80,000 అయిందనుకుందాం. తను 20% కో-పేమెంట్ ఆప్షన్‌ను తీసుకుంటే ఇతను రూ.16,000 చెల్లిస్తే మిగిలిన రూ.64,000 బీమా కంపెనీ చెల్లిస్తుంది. ప్రైవేటు కంపెనీలు సీనియర్ సిటిజన్స్ పాలసీల్లో, అప్పటికే ఉన్న వ్యాధులకు రక్షణ కల్పించే విషయంలో ఈ కో-పేమెంట్ సదుపాయం కల్పిస్తున్నాయి.
             - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

మరిన్ని వార్తలు