రూ. 10 వేల కోట్ల సమీకరణలో ఓయో

9 Oct, 2019 10:07 IST|Sakshi

అమెరికా, యూరప్‌లో విస్తరణ

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా 1.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10,650 కోట్లు) సమీకరించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో విస్తరణకు, యూరప్‌లో కార్యకలాపాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌.. ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌ ద్వారా 700 మిలియన్‌ డాలర్లు సమకూర్చనుండగా, మిగతా 800 మిలియన్‌ డాలర్ల నిధులను ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

నిధుల సమీకరణకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించినట్లు అగర్వాల్‌ చెప్పారు. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్, లైట్‌స్పీడ్, సెకోయా క్యాపిటల్‌ తదితర ఇన్వెస్టర్లు తమకు పూర్తిగా మద్దతునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌లో సుమారు 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు కొన్నాళ్ల క్రితం అనుమతులు లభించాయి. ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 35,000 హోటల్స్‌.. 1,25,000 పైగా వెకేషన్‌ హోమ్స్‌ ఉన్నాయి.

మరిన్ని వార్తలు