50 రోజుల్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేసినా పాన్ ఇవ్వాలి

18 Nov, 2016 00:19 IST|Sakshi
50 రోజుల్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేసినా పాన్ ఇవ్వాలి

ఆదాయపన్ను శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేలకు మించి చేసే నగదు జమలకు పాన్ నంబర్ ఇవ్వాలనే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉండగా... ఈ నెల 9 నుంచి డిసెంబర్ 30వ తేదీ మధ్య కాలంలో రూ.2.5 లక్షలు, అంతకు మించి చేసే డిపాజిట్లకు కూడా ఇది తప్పనిసరి అని ఆదాయపన్ను శాఖ తాజాగా స్పష్టం చేసింది. అంటే పాన్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఒక రోజులో రూ.50 వేలకు మించకుండా, రోజుకు కొంత చొప్పున డిపాజిట్ చేసుకుందామనుకుంటే ఇకపై వీలు పడదు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు 50 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే.

ఈ కాలంలో నల్లధనాన్ని మార్చుకునే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు ఆదాయపన్ను శాఖ ఈ ఆదేశాలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 25 కోట్ల పాన్‌లను జారీ చేసినట్టు పేర్కొంది. ఆదాయపన్ను శాఖ నోటిఫికేషన్ ప్రకారం... బ్యాంకులు, పోస్టాఫీసులు ఒక రోజులో రూ.50 వేలకు మించి చేసే డిపాజిట్ దారుల వివరాలు, ఈ నెల 9 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.50 లక్షల వరకు డిపాజిట్ చేసే వారి వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ 50 రోజుల గడువులోపు సేవింగ్‌‌స ఖాతాల్లో రూ.2.50 లక్షలకు మించి, కరెంట్ ఖాతాల్లో రూ.12.50 లక్షలకు చేసే డిపాజిట్ల వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలని బ్యాంకులు, పోస్టాఫీసులను కోరిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు