బిల్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి

16 Dec, 2015 02:39 IST|Sakshi
బిల్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి

హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటికి వర్తింపు
* జనవరి 1 నుంచి అమల్లోకి
* దేశీయంగా నల్లధనం కట్టడికి కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ (పర్మనెంటు అకౌంటు నంబరు) తప్పనిసరి చేసింది.

లగ్జరీయేతర అంశాలకు సంబంధించి నగదు లావాదేవీల విషయంలో రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది. మరోవైపు పాన్ తప్పనిసరిగా పేర్కొనాల్సిన స్థిరాస్తి క్రయ, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది.

ఇది అందుబాటు ధరలోని గృహాలు కొనుగోలు చేసే వారికి ఊరటనివ్వనుంది. గతంలో రూ. 5 లక్షల విలువ చేసే స్థిరాస్తుల క్రయ,విక్రయాలకు కూడా పాన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావించింది. తాజా నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా తెలిపారు. బ్లాక్‌మనీ చలామణి ఎక్కువగా జరిగే ఆభరణాలు.. బులియన్ కొనుగోళ్ల లావాదేవీ విలువ రూ. 2 లక్షలు మించితే పాన్ పేర్కొనక తప్పదని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ పరిమితి రూ. 5 లక్షలకు మించి ఉంది. మరోవైపు, రూ. 2 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలకు పాన్ నంబరును పేర్కొన డం తప్పనిసరిగా చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. 2015-16 బడ్జెట్ ప్రసంగంలో రూ. 1 లక్ష పైగా విలువ చేసే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించినా జైట్లీ తాజాగా ఆ పరిమితిని పెంచారు.
 
బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపుల దాకా ..
 క్యాష్ కార్డులు లేదా ప్రీపెయిడ్ సాధనాల కొనుగోలుకు రూ. 50,000కు మించి నగదు చెల్లింపులు జరిపినా లేదా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల కొనుగోలుకు రూ. 1లక్షకు పైగా చెల్లించినా పాన్ తప్పనిసరి కానుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మినహా ఇతరత్రా బ్యాంకు ఖాతాలేవీ తెరవాలన్నా పాన్ తప్పదని అధియా వివరించారు.

విలాసవంతమైన ఖర్చులు అయినందున.. హోటల్, విదేశీ పర్యటన బిల్లులను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు అధియా పేర్కొన్నారు. రూ. 2 లక్షలు మించిన మిగతా అన్ని నగదు లావాదేవీలకూ పాన్ నంబరు తప్పనిసరన్నారు. ఇది తాత్కాలికమేనని, అంతిమంగా ఈ పరిమితిని రూ. 1 లక్షకు తగ్గించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు.
 
కొన్నింట ఊరట..

సిసలైన లావాదేవీలకు నిబంధనల చిక్కులు తొలగించేందుకు, అదే సమయంలో భారీ లావాదేవీల వివరాలను సరిగ్గా రాబట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకున్నట్లు అధియా చెప్పారు. ఇందులో భాగంగానే స్థిరాస్తి కొనుగోలు, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. హోటల్, రెస్టారెంటు బిల్లుల పరిమితిని రూ. 25,000 నుంచి రూ. 50,000కు పెంచినట్లు పేర్కొన్నారు.

ఇక, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల క్రయ,విక్రయాల విలువనూ రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచినట్లు వివరించారు. బేసిక్ ల్యాండ్‌లైన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకునే విషయంలో పాన్ నిబంధనను సడలించినట్లు అధియా తెలిపారు. రూ. 50,000కు మించిన నగదు డిపాజిట్లు లేదా ఒకే రోజున అంత మొత్తం విలువ చేసే బ్యాంక్ డ్రాఫ్ట్/పే ఆర్డర్లు/ బ్యాంకర్స్ చెక్ మొదలైనవి తీసుకున్నా, రూ. 50,000 జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్ తప్పనిసరి నిబంధన యథాప్రకారంగా కొనసాగుతుందని ఆయన వివరించారు.

బ్లాక్‌మనీపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .. రూ. 1 లక్ష పైగా విలువ చేసే అన్ని రకాల వస్తువులు, సర్వీసుల క్రయ,విక్రయాలకు పాన్ నంబరు తప్పనిసరి చేయాలంటూ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు