ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? మీకో గుడ్‌ న్యూస్‌

3 Sep, 2019 14:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన  వారికి  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)  శుభవార్త అందించింది. పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి  ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్‌గా పాన్ కార్డును జారీ చేయనుంది.  ఈ మేరకు సీబీడీటీ సోమవారం ఒక  ప్రకటన జారీ  చేసింది.

సీబీడీటీ విడుదల  చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం వ్యక్తిగతంగా ఆధార్ నెంబరు ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి ఆటోమేటిక్‌గా పాన్ కార్డును ఇవ్వనుంది.  బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించిన విధంగా ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ కార్డును ఉపయోగించడం అంటే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లుగా పరిగణింస్తున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది.  ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, త్వరలోనే పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీడీ ఛైర్మన్‌ పీసీ మోడీ తెలిపారు.  ఆధార్ కార్డులో  వినియోగదారుడి పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, తదితర వ్యక్తిగత వివరాలను యూఐడీఏఐ ద్వారా   ఆదాయ పన్ను శాఖ సేకరించి దాని ఆధారంగా 10 అంకెల  పాన్ కార్డును  జారీ చేస్తామన్నారు.  పాన్ కార్డులేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించు కోవచ్చునని   ఆదాయపన్ను చట్టం ప్రకారం పాన్‌కు ఆధార్ ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు