పనాసియా బయో- జూబిలెంట్‌ లైఫ్‌.. భళా

10 Jun, 2020 12:21 IST|Sakshi

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌కు ఒప్పందం

పనాసియా బయో- 20% అప్పర్‌ సర్క్యూట్‌

Q4 ఫలితాలు- రెమ్‌డెసివిర్‌కు లైసెన్స్‌

జూబిలెంట్‌ లైఫ్‌- ఏడాది గరిష్టానికి చేరువ

ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య ప్రకంపనలు సృష్టిస్తున్న కోవిడ్‌-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో పనాసియా బయోటెక్‌ కౌంటర్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక మరోపక్క కరోనా వైరస్‌కు చెక్‌పెట్టగల రెమ్‌డెసివిర్‌ ఔషధ లైసెన్సింగ్‌కు ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకున్న జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

పనాసియా బయోటెక్‌
కోవిడ్‌-19 నివారణకు వినియోగించగల వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భాగంగా యూఎస్‌ కంపెనీ రెఫానాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తాజాగా పనాసియో బయోటెక్‌ వెల్లడించింది. తద్వారా ఈ వ్యాక్సిన్‌ అంతర్జాతీయ అభివృద్ధి, తయారీ, పంపిణీలకు వీలు కలగనున్నట్లు తెలియజేసింది. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, వాణిజ్య ప్రాతిపదికన తయారీలతోపాటు.. క్లినికల్‌ డెవలప్‌మెంట్‌ తదితర కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని వివరించింది. ఈ వ్యాక్సిన్‌ను 50 కోట్ల డోసేజీల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పనాసియా బయోటెక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ఈ షేరు రూ. 34 ఎగసి రూ. 204 సమీపంలో ఫ్రీజయ్యింది. తద్వారా ఏప్రిల్‌ 28న సాధించిన ఏడాది గరిష్టం రూ. 211కు చేరువలో నిలిచింది.

జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించాక జోరందుకున్న హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్‌ మరోసారి జోరు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 8.5 శాతం జంప్‌చేసి రూ. 604 వద్ద ట్రేడవుతోంది. తొలుత 12 శాతం దూసుకెళ్లి రూ. 625ను తాకింది. తద్వారా జనవరి 23న నమోదైన 52 వారాల గరిష్టం రూ. 639కు చేరువైంది. ఈ నెలలో ఇప్పటివరకూ ఈ షేరు 41 శాతం ర్యాలీ చేయడం విశేషం! కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జూబిలెంట్‌ లైఫ్‌ నికర లాభం 92 శాతం జంప్‌చేసి రూ. 260 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 2391 కోట్లకు చేరింది. ఇటీవల యూఎస్‌ దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధ తయారీ, మార్కెటింగ్‌కు జూబిలెంట్‌ లైఫ్‌.. లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు