ఇదొక నిజమైన మాయా దర్పణం

5 Oct, 2016 20:00 IST|Sakshi
ఇదొక నిజమైన మాయా దర్పణం

టోక్యో: మాయాబజార్ సినిమాలో టీవీలాగా పనిచేసే మాయా దర్పణాన్ని చూశాం. టీవీల ఉత్పత్తుల్లో జపాన్ దిగ్గజమైన పానాసోనిక్ మాయా దర్పణంలా కనిపించే టీవీనే ఇప్పుడు తయారు చేసింది. ఆ టీవీ అచ్చం కబోర్డుకు బిగించిన పారదర్శక అద్దంలా ఉంటుంది. ఆ అద్దం వెనకాలున్న వస్తువులేవైనా మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చేతి సైగల ద్వారాగానీ, రిమోట్ ద్వారాగానీ టీవీ ఆన్ చేయగానే పారదర్శక అద్దం కాస్తా టీవీ స్క్రీన్‌గా మారిపోతుంది. టీవీ కార్యక్రమాల ప్రసారాలను పసందుగా వీక్షించవచ్చు. ఇంతవరకు ఎప్పుడూ చూడనంత పలుచగా టీవీ స్క్రీన్ ఉండడమే కాకుండా స్పష్టంగా కూడా ఉంటుందనడంలో సందేహం లేదు.
 
దీని మొదటి ప్రోటోటైప్ మోడల్‌ను లాస్ వెగాస్‌లో జనవరి నెలలో వినియోగదారుల ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్‌లో పానాసోనిక్ కంపెనీ ప్రదర్శించింది. అయితే ఆ పాత ప్రోటోటైప్ మోడల్‌ను ఎంతో అభివృద్ధి చేసి ఇప్పుడు టీవీని నిజమైన మాయా దర్పణంగా మార్చేసింది. మొదటి మోడల్ టీవీకి ఎల్‌ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్స్) స్క్రీన్‌ను ఉపయోగించగా, ఇప్పుడు అభివృద్ధి చేసిన మోడల్‌కు ఓఎల్‌ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్) స్క్రీన్‌ను ఉపయోగించింది. ఎల్‌ఈడీలో సాంకేతికంగా తెర వెనక నుంచి లాక్కునే కాంతి ద్వారా పిక్సల్స్ వెలిగితే ఓఎల్‌ఈడీలో తెరమీదనే కాంతిని సృష్టించుకుంటోంది. అప్పుడు పిక్సల్స్ వెలుగుతాయి.


ఈ ఓఎల్‌ఈడీలో ఉండే సాంకేతిక ప్రయోజనాల వల్ల స్క్రీన్‌ను అతి పలుచగాను, పారదర్శకంగాను తయారు చేయవచ్చు. క్యాథోడ్, ఆనోడ్ అని పిలిచే రెండు ఎలక్ట్రోడ్స్ ప్యానెళ్ల మధ్య ప్లాస్టిక్ పొరను ఏర్పాటు చేసి, దాన్ని అద్దం ఉపరితలంపైన అతికిస్తారు. ఈ ప్యానెళ్ల పైకి విద్యుత్‌ను సరఫరా చేయడం ద్వారా లైట్ ఎమిటింగ్ టెక్నాలజీతో స్క్రీన్‌పైన పిక్సల్స్ వెలుగుతాయి. భవిష్యతంతా ఓఎల్‌ఈడీ టీవీలదేనని చెబుతున్న పానాసోనిక్ యాజమాన్యం ఈ టీవీ మార్కెట్లోకి రావడానికి మరో మూడేళ్లు పడుతుందని తెలిపింది. ఈ అద్దం లాంటి టీవీ వీడియోలను సోషల్ మీడియాకు విడుదల చేసింది.

మరిన్ని వార్తలు