‘మిస్డ్‌ కాల్‌’తో ఇంట్లో స్వచ్ఛత

6 Aug, 2018 11:28 IST|Sakshi
రీతు

ఇంటికి వచ్చి పేపర్లు, ప్లాస్టిక్‌ వేస్ట్‌ను తీసుకెళుతున్న యువత

రీసైక్లింగ్‌ చేసి వినియోగంలోకి తెస్తున్న ‘స్క్రాప్‌క్యూ’  

పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేస్తున్న వైనం

‘ఒక టన్ను పేపర్‌ రీస్లైకింగ్‌ చేయడం వల్ల 17 చెట్లను రక్షించినట్టవుతుంది.ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌ రీసైక్లింగ్‌ నెలకు60 వాట్ల విద్యుత్‌ను ఆదా చేస్తుంది.ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను విసిరిస్తే అది కనుమరుగు కావడానికి 500 ఏళ్లు పడుతుంది.ఇలా ఇంట్లో ఉండే చెత్తకు సంబంధించిన ప్రయోజనాలను ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూనే ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే మీ ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి రీసైక్లింగ్‌ చేస్తామంటున్నారు నగరానికి చెందిన బిందు, లత, రీతూలు. స్వచ్ఛభారత్‌ తరహాలోనే ఈ ముగ్గురు కార్పొరేట్‌ ఉద్యోగులు ‘స్క్రాప్‌క్యూ’స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు.  

సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో ఓ మూలన పడేసే పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను కొనుగోలు చేసి ఇంటి స్వచ్ఛతతో పాటు ఆర్థికంగానూ బాసటగా ఉంటున్నారు వీరు. ఈ చెత్త రీసైక్లింగ్‌ కోసం ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. హ్యాపీ స్మైల్‌ ఫౌండేషన్‌కు విరాళాలిస్తూ వారి సేవలో పరోక్షంగా భాగస్వామ్యులవుతున్నారు. 

చెత్తతో మేలంటూ ప్రచారం..
ఇంట్లో చెత్త ఉండడం వల్ల కలిగే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలంలో అయితే ఈ తిప్పలు చెప్పనక్కర్లేదు. ఇంట్లో శుభ్రతకు ఈ చెత్త ఎప్పుడూ అడ్డే. నగరంలో ఎక్కువ మంది అద్దెదారులే. దీంతో ఆ చెత్తను ఉన్న ఇంట్లోనే ఓ మూలాన పెడుతుంటారు. చెత్త కొనేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటారు. ఇంకొందరు వీలు చూసుకుని స్క్రాప్‌ దుకాణం ఎక్కడో వెదుక్కొని మరీ ఈ చెత్తను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నగరంలో చెత్తను ఎక్కడిపడితే అక్కడ పడేయడం వల్ల కలిగే అనర్థాలను, రీసైక్లింగ్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను బిందు, లత, రీతూ ప్రజలకు వివరిస్తున్నారు. ‘తొలుత సామాజిక మాధ్యమాలను ప్రచారం కోసం ఎంచుకున్నాం. ఆ తర్వాత కాలనీలు, వీధుల్లో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చివరకు ఇంటి ఇంటికీ వెళ్లి చెత్త విశిష్టతను తెలియజేస్తూ వాటిని పడేయవద్దని చెబుతున్నా’మంటున్నారు వీరు. 

మిస్డ్‌ కాల్‌తో మీ ఇంటికి..
‘మీ ఇంట్లో పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉంటే 040–30707070 నంబర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వండి. మా సిబ్బంది మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో వచ్చి డబ్బులు చెల్లించి చెత్త కొంటారు’ అని చెబుతున్నారు ఈ యువతులు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘స్క్రాప్‌క్యూ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో వివరాలు నమోదు చేయాలని వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు