తల్లిదండ్రుల హోదా వస్తోందా?

18 Jul, 2016 00:46 IST|Sakshi
తల్లిదండ్రుల హోదా వస్తోందా?

పుట్టబోయే బిడ్డకోసం కాస్తంత ప్లానింగ్   
బీమా, విద్య, సంరక్షకులే ప్రధానం...

 దంపతులు తల్లిదండ్రులుగా మారుతున్నపుడు ఎన్నో ఆశలు, ఊహలు మదిలో మెదులుతుంటాయి. చిన్నారి కోసం ప్రత్యేకంగా ఓ గది అలంకరించడం దగ్గర్నుంచి వారికోసం ఓ ఉయ్యాల, ఇతర సామగ్రిని సిద్ధం చేసే పనిలో పడతారు. కానీ, వీటితోపాటు కాబోయే తల్లిదండ్రులు చేయాల్సింది మరొకటి ఉంది. చిన్నారి బంగారు భవిత కోసం చక్కని ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం.

 ఇప్పటి వరకు ఇద్దరే. ఇకపై ముగ్గురు. మీ మధ్యకు మూడో వ్యక్తి రాకతో జరిగే మార్పులపై దృష్టి సారించాలి. తమ కలల రూపమైన చిన్నారి అభివృద్ధికి, అవసరాలకు అనుగుణంగా ఇంటి ఖర్చులు, పొదుపు, మదుపు ఇలా అన్నింటినీ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. వారికి తగినంత సమయం కేటాయించాలి. పిల్లలు రాక ముందు ఆదాయం ఎంతున్నా... ఒక్కరు సంపాదించినా చీకూ చింతా లేకుండా జీవించేస్తారు. కానీ, చిన్నారి రాకతో అదనపు, ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. వాటిని తట్టుకునేలా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఎంత వరకు సంపాదిస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత పొదుపు చేస్తున్నారు? ఈ విషయాలపై ముందుగా స్పష్టత ఉండాలి. దాంతో చిన్నారి సంరక్షణ కోసం ఎంత వరకు ఖర్చు చేయగలరు? వారి బంగారు భవిష్యత్తు కోసం ఎంత పొదుపు చేయగలరు? వారి కోసం ఎన్ని సెలవులు తీసుకోవాలన్న దానిపై స్పష్టత వస్తుంది.  

 జీవిత బీమా తప్పనిసరి...
తల్లిదండ్రులుగా మారిపోయిన తర్వాత అప్పటి వరకు తమ కోసం జీవించిన వారు... అప్పటి నుంచి తమ చిన్నారి కోసం జీవించడం మొ దలు పెడతారు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఏవరో ఒకరికి లేదా ఇద్దరికీ దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే...? ఆ చిన్నారి సంరక్షణ, భవిష్యత్తు అవసరాలను ఎవరు చూస్తారు? అందుకే తల్లిదండ్రులు ఇద్దరూ తమ పేరిట జీవిత బీమా తీసుకోవాలి. తాను లేకపోయినా తనపై ఆధారపడిన వారి పోషణ, అవసరాలు, పిల్లల విద్యావసరాలు, ఆర్థిక ఇబ్బందులు,  రుణాలను తీర్చేంత బీమా తీసుకోవాలి.

 సంరక్షకుల్ని ముందే నిర్ణయించాలి
తన మరణానంతరం తన ఆస్తులు ఎవరికి చెందాలన్నది చెబుతూ విల్లు రాయటం ముఖ్యమే. కానీ, అంతకంటే ముందు పిల్లలున్న తల్లిదండ్రులు సంరక్షణ బాధ్యతలను ఎవరు చూడాలన్నది నిర్ణయించడం ఎంతో ముఖ్యం. దంపతులకు ఏదైనా జరిగితే... సంరక్షణ బాధ్యతలు ఎవరు చూడాలన్నది నిర్ణయించి ఉండకపోతే... అప్పుడు కోర్టే ఆ పని చేస్తుంది. కోర్టు నియమించిన సంరక్షకుడు దంపతుల ఆశలకు అనుగుణంగా చిన్నారికి తగిన న్యాయం చేయలేకపోవచ్చు. అందుకే ఈ బాధ్యతలకు తగిన వ్యక్తిని నిర్ణయించాలి. 

చిన్నారుల విద్యకూ ప్రాధాన్యం!
జీవన వ్యయాన్ని మించి విద్యా వ్యయం మన దేశంలో పరుగులు తీస్తోంది. అందుకే భవిష్యత్తు ఖర్చులను తీర్చేందుకు వీలుగా మదుపు చేయాలి. ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల పథకాలున్నాయి. పిల్లల అన్ని రకాల విద్యావసరాలకు తగినట్టు మధ్య మధ్యలో రాబడులను ఇచ్చే పథకాలు అనువుగా ఉంటాయి. ఈ అవసరాలను తీర్చే విధంగా బీమా కంపెనీలు భిన్న ప్రయోజనాలతో కూడిన పథకాలను అందిస్తున్నాయి. ఒకవేళ జరగరానిది జరిగితే తల్లిదండ్రులు లేకపోయినా, చిన్నారి విద్యా అవసరాలను బీమా పాలసీ తీరుస్తుంది. చాలా కంపెనీలు ప్రీమియం వైవర్ రైడర్‌తో వస్తున్నాయి. పాలసీదారుడు మరణించిన సందర్భంలో ప్రీమియం చెల్లించే పని లేకుండానే కొనసాగుతుంది. వారి వారసులకు 18 లేదా 21 ఏళ్లు వచ్చిన వెంటనే బీమా ప్రయోజనాలు చెల్లించబడతాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా