మొండి బాకీలను ముందే ఎందుకు గుర్తించలేదు?

28 Aug, 2018 01:05 IST|Sakshi

ఆర్‌బీఐని ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానల్‌

న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎన్‌పీఏల నిరోధానికి ముందుగానే చర్యలు తీసుకోవడంలో ఆర్‌బీఐ వైఫల్యాన్ని పార్లమెంటరీ ప్యానల్‌ ప్రశ్నించింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ హయాంలో 2015 డిసెంబర్‌లో చేపట్టిన బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్షతో (ఆక్యూఆర్‌) మొండి బకాయిల (ఎన్‌పీఏలు) పుట్ట కదిలిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఆస్తుల నాణ్యత సమీక్షకు పూర్వమే ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి ముందస్తు సంకేతాలను ఎందుకు పసిగట్టలేకపోయిందో ఆర్‌బీఐ వెల్లడించాల్సి ఉందని ఆర్థిక శాఖ స్టాండింగ్‌ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ నివేదికను కాంగ్రెస్‌ నేత వీరప్పమొయిలీ అధ్యక్షతన గల స్టాండింగ్‌ కమిటీ సోమవారమే ఆమోదంలోకి తీసుకుందని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుంచే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం సభ్యుడిగా ఉన్నారు. పునరుద్ధరణ పథకాల ద్వారా ఒత్తిడిలోని రుణాలను ఎప్పటికప్పుడు కొనసాగించడం వెనుక కారణాలను ఈ కమిటీ ప్రశ్నించింది. ఎన్‌పీఏ విషయంలో ఆర్‌బీఐ పాత్ర ఆశించిన స్థాయిలో లేదని కమిటీ అభిప్రాయపడింది. 2015 మార్చి, 2018 మార్చి మధ్య ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.6.2 లక్షల కోట్ల మేర పెరిగిపోయిన నేపథ్యంలో కమిటీ ఆర్‌బీఐ పాత్రపై సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది.

జీడీపీ రేషియోలో రుణాల జారీ 2017 డిసెంబర్‌ నాటికి చైనాలో 208 శాతం, బ్రిటన్‌లో 170 శాతం, అమెరికాలో 152 శాతంగా ఉంటే, మన దేశంలో తక్కువగా 54.5 శాతమే ఉండడాన్ని కమిటీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉన్న అస్సెట్, క్యాపిటల్‌ లెవరేజ్‌ నిష్పత్తిని (ఆస్తులు, నిధుల మధ్య అంతరం) ఆర్‌బీఐ పరిశీలించడం ద్వారా, బ్యాంకుల నిధుల పరిమాణాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించింది. బ్యాంకుల్లో రూ.250 కోట్లకు మించిన ఎన్‌పీఏ ఖాతాలను ప్రత్యేకమైన ఏజెన్సీల ద్వారా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ఇందుకోసం నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.

>
మరిన్ని వార్తలు