భారీ ఎన్‌పీఏ ఖాతాలపై ఆర్‌బీఐ సమీక్ష

16 Aug, 2018 00:31 IST|Sakshi

నిధుల కేటాయింపు,   నిబంధనల అమలుపై ఆరా 

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న మొండి బకాయిలకు(ఎన్‌పీఏలు) చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. 200 భారీ ఎన్‌పీఏ ఖాతాలను, వాటికి బ్యాంకులు చేసిన ప్రొవిజనింగ్‌ (నిధుల కేటాయింపు)ను పరిశీలిస్తోంది. తద్వారా ఆయా ఖాతాల వల్ల బ్యాంకులపై వాస్తవంగా ఏ మేరకు ఒత్తిడి ఉందో ఆర్‌బీఐ తెలుసుకోనుంది. ఈ ఎన్‌పీఏ ఖాతాల విషయంలో బ్యాంకులు నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నాయో ఆర్‌బీఐ పరిశీలిస్తోందని ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్‌ అధికారి తెలిపారు. వసూళ్లు నిలిచిపోయిన రుణ ఖాతాల వర్గీకరణ, వాటికి నిధుల కేటాయింపు, రుణాల పునర్నిర్వచనం  గురించి వివరాలు ఆరా తీస్తోందని పేర్కొన్నారు.

ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆర్‌బీఐ చేపట్టే సాధారణ బ్యాంకు ఖాతాల తనిఖీయేనని మరో అధికారి తెలిపారు. ఈ భారీ ఎన్‌పీఏ ఖాతాల్లో వీడియోకాన్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ ఉన్నట్టు చెప్పారు. బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రూ.10.3 లక్షల కోట్లకు  (మొత్తం రుణాల్లో 11.3%) పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంకు ఖాతాల సమగ్ర తనిఖీకి పూనుకోవడం గమనార్హం. 2017 మార్చి నాటికి బ్యాంకుల మొత్తం ఎన్‌పీఏలు రూ.8 లక్షల కోట్లు (9.5%)గానే ఉన్నాయి. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆర్‌బీఐ  తనిఖీల్లో యాక్సిస్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్‌పీఏలు తక్కువగా చూపించినట్టు వెలుగు చూసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు