ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో 2% క్షీణత

9 May, 2019 00:04 IST|Sakshi

ఏప్రిల్‌ గణాంకాలను విడుదల చేసిన ఎఫ్‌ఏడీఏ

న్యూఢిల్లీ: గత నెల ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ విక్రయాలు 2,42,457 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది (2018) ఇదేకాలానికి నమోదైన పీవీ అమ్మకాలతో పోల్చితే 2 శాతం క్షీణత ఉన్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 9% తగ్గి 12,85,470 యూనిట్లుగా నమోదుకాగా.. వాణిజ్య వాహనాల సేల్స్‌ 16 శాతం క్షీణించి 63,360 యూనిట్లుగా నిలిచాయి. గతనెల్లో త్రిచక్ర వాహనాల విక్రయాలు 13% తగ్గి 47,183 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,38,470 యూనిట్లుగా తెలిపింది. గతేడాదిలో నమోదైన 17,86,994 యూనిట్లతో పోల్చితే 8% తగ్గుదల చోటుచేసుకుంది.

ఈ అంశంపై ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ హర్షరాజ్‌ కాలే మాట్లాడుతూ.. ‘గతేడాది ఏప్రిల్‌లో హైబేస్‌ కారణంగా ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదుచేశాయి. సమీపకాలంలో సానుకూల అంశాలు లేనందున.. వచ్చే 8–12 వారాల్లో ప్రతికూలతకే అవకాశం ఉంది. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, ఆశాజ నకంగా వర్షాలు పడే అవకాశాలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఆదుకోవచ్చు. పేరుకుపోయిన నిల్వలు మాత్రం డీలర్లకు భారమనే చెప్పాలి’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు